‘కునో’లో కొనసాగుతున్న చీతాల మరణాలు.. రెండు నెలల్లో నాలుగో మృతి

  • మార్చి 24న నాలుగు కూనలకు జన్మనిచ్చిన ‘జ్వాల’
  • బలహీనత వల్లే మృతి చెందిందన్న అధికారులు
  • ఆసుపత్రికి తరలించిన ఐదు పదినిమిషాల్లోనే మృతి
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన చీతాల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు చీతాలు మృత్యువాత పడగా తాజాగా రెండు నెలల వయసున్న చీతా కూన ప్రాణాలు విడిచింది. రెండు నెలల వ్యవధిలో ఇది నాలుగో మరణం కావడం గమనార్హం. పర్యవేక్షక బృందం పార్క్‌లో పరిశీలించినప్పుడు కూన చాలా బలహీనంగా కనిపించిందని, దీంతో వెటర్నరీ వైద్యులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించినట్టు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు. అయితే, ఆసుపత్రికి తరలించిన ఐదు పది నిమిషాలకే అది మరణించినట్టు చెప్పారు. చాలా బలహీనంగా ఉండడం వల్లే అది మరణించినట్టు పేర్కొన్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

చీతా జ్వాల (సియాయా) మార్చి 24న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. వీటితో కలిపి చీతాల సంఖ్య 24కు పెరిగింది. వీటిలో నాలుగు మృతి చెందడంతో ఇప్పుడు 20 మాత్రమే మిగిలాయి. అందులో 17 చీతాలు, మూడు కూనలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇంకా అడవిలో విడిచిపెట్టాల్సి ఉంది. 

నమీబియా నుంచి తీసుకొచ్చిన వాటిలో సాషా అనే చీతా కిడ్నీ సంబంధిత సమస్యలతో మార్చి 27న మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో ఉదయ్ ఏప్రిల్ 13న మరణించగా, సౌతాఫ్రికా నుంచే తెచ్చిన మరో చీతా దక్ష మరో చీతాతో జరిగిన పోరాటంలో తీవ్రంగా గాయపడి మే 9న ప్రాణాలు కోల్పోయింది. తాజాగా, చీతా కూన మరణించింది.


More Telugu News