నోటి దురుసు ఫలితం.. ట్రంప్ మెడకు చుట్టుకున్న మరో కేసు

  • మాజీ అధ్యక్షుడిపై కోటి డాలర్లకు పరువు నష్టం దావా వేసిన రచయిత్రి
  • 1996లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ట్రంప్ పై కెరోల్ ఆరోపణ
  • ఈ కేసులో కెరోల్ కు అనుకూలంగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం
  • తాజాగా మరోమారు కెరోల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. రచయిత్రి జీన్ కెరోల్ పై చేసిన వ్యాఖ్యలకు 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడ్డాక కూడా ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోలేదు. కెరోల్ పై మళ్లీ నోరుపారేసుకోవడంతో ప్రస్తుతం కోటి డాలర్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నారు. ఈ దావా ఓడిపోతే ట్రంప్ సదరు రచయిత్రికి కోటీ యాభై లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.

ఓ పత్రికలో సలహాల శీర్షిక నిర్వహించే జీన్ కెరోల్ అనే రచయిత్రి ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 1996 లో మన్ హటన్ లోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోరులో ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కెరోల్ ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యలతో తాను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. అసలు కెరోల్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని ట్రంప్ చెప్పారు. కెరోల్ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై కెరోల్ కోర్టుకెక్కింది. తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడాడంటూ ట్రంప్ పై దావా వేసింది. లైంగిక వేధింపులపైనా కోర్టును ఆశ్రయించింది. రెండు వారాల క్రితం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. కెరోల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ, కెరోల్ కు 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత సీఎన్ఎన్ టీవీ చానల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ కెరోల్ ఆరోపణలు, ఆమె మాట్లాడే మాటలు అన్నీ కూడా అవాస్తవాలని విమర్శించారు. దీనిపై కెరోల్ మరోమారు కోర్టును ఆశ్రయించింది. ఈసారి కోటి డాలర్లకు పరువు నష్టం దావా వేసింది.



More Telugu News