పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీకి షాకివ్వనున్న ప్రతిపక్షాలు!

  • ప్రారంభోత్సవాన్ని ఉమ్మడిగా బహిష్కరించే యోచనలో ప్రతిపక్షాలు
  • కార్యక్రమానికి హాజరు కాబోమని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ ప్రకటన
  • భావసారూప్యత గల ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం
  • బుధవారం ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటనకు అవకాశం
పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని మోదీనే ప్రారంభించే పక్షంలో ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నెల 28న పార్లమెంటు నూతన భవనం ప్రారంభించనున్నారు. 

ప్రారంభోత్సవానికి తాము హాజరుకావడం లేదని తృతమూల్ కాంగ్రెస్, సీపీఐ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాలని ప్రతిపక్షాల యోచనగా ఉంది. ఇందు కోసం భావసారూప్యత కలిగిన పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పార్లమెంటు భవనం కేవలం ఒక నిర్మాణం కాదని, అది దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని తృణమూల్ నేత, ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ ఇప్పటికే పేర్కొన్నారు. ఇది ప్రధాని సొంత వ్యవహారం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, 2020లో భవన నిర్మాణ శంకుస్థాపనకూ ప్రతిపక్షాలు హాజరుకాని విషయం తెలిసిందే.


More Telugu News