మూడేళ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ.. జూన్ 9 నుంచి మొదలు!

  • మృగ‌శిర కార్తె సంద‌ర్భంగా చేప ప్ర‌సాదం పంపిణీ చేయ‌నున్న బత్తిన సోదరులు
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
  • 2020 తర్వాత పంపిణీ చేస్తుండ‌టంతో జనం భారీగా వ‌చ్చే అవ‌కాశం
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత చేప ప్ర‌సాదం పంపిణీకి ముహుర్తం ఖ‌రారైంది. జూన్ 9న మృగ‌శిర కార్తె సంద‌ర్భంగా చేప ప్ర‌సాదం పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేయ‌నున్నారు. మంగళవారం తెలంగాణ స‌చివాల‌యంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ను బ‌త్తిన కుటుంబ స‌భ్యులు క‌లిశారు. చేప ప్ర‌సాదం పంపిణీపై ఈ సందర్భంగా చ‌ర్చించారు.

ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బ‌త్తిన సోద‌రులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిన‌ వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు హైదరాబాద్‌కు వస్తుంటారు. కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. ఇక 2020 తర్వాత పంపిణీ చేస్తుండ‌టంతో జనం భారీగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఇందుకు త‌గినట్లుగా ఏర్పాట్లు చేయాల‌ని నిర్ణ‌యించారు.


More Telugu News