వీడియోలకు లైక్ కొడితే డబ్బులిస్తామంటూ 19 లక్షలు కాజేసిన కేటుగాడు

  • పార్ట్ టైమ్ జాబ్ పేరుతో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి టోకరా
  • యూట్యూబ్ లో వీడియోలకు లైక్ కొట్టడమే ఉద్యోగమని నమ్మించిన వైనం
  • పెట్టుబడి పేరుతో విడతల వారీగా లక్షల్లో కాజేసిన దుండగులు
ఇంట్లోనే కూర్చుని ఖాళీ సమయాల్లో పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం.. స్మార్ట్ ఫోన్, నెట్ కనెక్షన్ ఉంటే చాలు రోజూ వేలల్లో ఆర్జన అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించి సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకు వేలల్లో సంపాదించుకోవచ్చని ఆశ పెడుతూ ఖాతాల్లో సొమ్మును ఊడ్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన యువతి ఖాతాలో నుంచి 19 లక్షలను కేటుగాళ్లు కొట్టేశారు.

ఏపీలోని విజయవాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. సోషల్ మీడియాలో కనిపించిన పార్ట్ టైమ్ జాబ్ ప్రకటన చూసి అదనపు సంపాదన కోసం ఆశ పడింది. ప్రకటనలో సూచించిన నెంబర్ కు ఫోన్ చేయగా.. యూట్యూబ్ లో వీడియోలను చూసి లైక్ కొడితే సరిపోతుందని, ఎన్ని లైక్ లు కొడితే అంత సంపాదించుకోవచ్చని చెప్పారు. నమ్మకం కలిగించేలా చెప్పడంతో అన్నింటికీ అంగీకరించిన యువతి, తన బ్యాంకు ఖాతా వివరాలన్నీ చెప్పింది.

ప్రారంభంలో వీడియోలు లైక్ చేసినందుకు చిన్న మొత్తాలను ఆమె ఖాతాలో జమ చేసిన దుండగులు.. ఆమెకు నమ్మకం కలిగాక ప్రిపెయిడ్ టాస్కుల పేరుతో మోసానికి తెర లేపారు. పెట్టుబడి పెట్టాలని, భారీ లాభాలు పొందొచ్చని ఆశపెట్టి విడతలవారీగా 19 లక్షల వరకు కాజేశారు. అయితే, వాళ్లు చూపిస్తున్న లాభాలు అంకెల్లోనే తప్ప విత్ డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో యువతి ప్రశ్నించింది. డబ్బు డ్రా చేసుకునే మార్గం చెప్పాలని డిమాండ్ చేసింది. తన పెట్టుబడి తిరిగివ్వాలంటే రూ.12.95 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన యువతి తాజాగా సైబర్ పోలీసులను ఆశ్రయించింది.


More Telugu News