నటుడు శరత్ బాబు మృతి పట్ల సీఎం కేసీఆర్, తలసాని సంతాపం

  • అనారోగ్యంతో శరత్ బాబు కన్నుమూత
  • శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్న కేసీఆర్
  • శరత్ బాబు ఏ పాత్రతో అయినా మెప్పించగలరన్న తలసాని 
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. శరత్ బాబు మృతికి సంతాపం తెలియజేశారు. శరత్ బాబు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 220కి పైగా చిత్రాల్లో నటించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఈ సమయంలో, శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. 

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా శరత్ బాబు మృతిపై స్పందించారు. సీనియర్ నటుడు శరత్ బాబు మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఏ పాత్ర అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు శరత్ బాబు అని అభివర్ణించారు. 

1973లో రామరాజ్యం చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు... తెలుగు, తమిళం, తదితర భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారని అన్నారు. శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో శరత్ బాబు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.


More Telugu News