వెండితెర 'జమిందార్'... శరత్ బాబు మృతిపై చిరంజీవి, పవన్ కల్యాణ్ స్పందన

  • తీవ్ర అనారోగ్యంతో శరత్ బాబు కన్నుమూత
  • శరత్ బాబు మరణవార్త కలచివేసిందన్న చిరంజీవి
  • ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని వెల్లడి
  • శరత్ బాబు మృతితో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • ఓ మంచి నటుడు దూరమయ్యారని విచారం 
తెలుగు చిత్ర పరిశ్రమ మరో సీనియర్ నటుడ్ని కోల్పోయింది. హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భిన్న పాత్రలతో అలరించిన శరత్ బాబు ఈ మధ్యాహ్నం హైదరాబాదులో కన్నుమూశారు. శరత్ బాబు మృతి పట్ల సీనియర్ కథానాయకుడు చిరంజీవి, ఆయన సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. 

వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు మరణవార్త కలచివేసిందని చిరంజీవి పేర్కొన్నారు. అందం, హుందాతనం ఉట్టిపడే నటనతో శరత్ బాబు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని చిరంజీవి తెలిపారు. అనేక చిత్రాలలో శరత్ బాబు తన సహనటుడిగా ఉన్నారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులందరికీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. 

అటు, పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ నటుడు శరత్ బాబు తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు కోలుకుంటారని అనుకున్నానని పవన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

"చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచి నాకు శరత్ బాబు గారితో పరిచయం ఉంది. నా మొదటి సినిమా అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. వకీల్ సాబ్ సినిమాలోనూ శరత్ బాబు నటించారు. హీరోగానే కాకుండా, సహాయ నటుడిగా, ప్రతినాయక పాత్రల్లోనూ విభిన్న భావోద్వేగాలు పలికించారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటన చూపించారు. శరత్ బాబు మరణంతో తెలుగు చిత్రసీమకు ఓ మంచి నటుడు దూరమయ్యారు. శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని వివరించారు.


More Telugu News