రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

  • మచిలీపట్నం సభలో జగన్‌ సమక్షంలోనే రిటైర్ మెంట్ ప్రకటన చేసిన పేర్ని నాని
  • మళ్లీ ఆయనతో మీటింగ్ లో పాల్గొంటానో లేదో తెలియదని వ్యాఖ్య
  • జగన్ చెప్పారంటే చేస్తారని, బందరుకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని ప్రశంస
తాను రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నానంటూ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. మరోసారి జగన్‌తో సమావేశం అవుతానో లేదో అంటూ ఆయన చెప్పడం గమనార్హం.

మచిలీపట్నం అభివృద్ధికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని పేర్ని నాని అన్నారు. బందరుకు సీఎం జగన్‌ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. ‘‘బందరు పోర్టు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు. నక్కజిత్తుల బాబు ఇంటికెళ్తేనే బందరు పోర్టుకు అనుమతులు వచ్చాయి. బందరులో కాలనీలు కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారు’’ అని చెప్పారు. 

మరోసారి జగన్‌తో వేదిక పంచుకునే అవకాశం దక్కుతుందో లేదో అంటూ తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి పేర్ని నాని ప్రస్తావించారు. ఎక్కువ సేపు మాట్లాడటంపై పక్కనున్న వారు సంకేతాలివ్వగా.. ‘‘లాస్ట్ ఇదే.. మళ్లీ జగన్ తో కలిసి నేను మీటింగ్ లో పాల్గొంటానో లేదో తెలియదు.. ఇప్పుడు నన్ను భరించాల్సిందే’’ అని అన్నారు. మరో సందర్భంలో ‘‘అందుకే రిటైర్ అయిపోతున్నా’’ అని చెప్పారు. 

‘‘జగన్ చెప్పారంటే చేస్తారు. మనందరి గుండెల్లో సుస్థిరమైన, బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సీఎం జగన్‌. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తెస్తున్న జగన్‌కు పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడైపోయాడు. అందుకే చేతులెత్తి మొక్కుతున్నా’’ అని అన్నారు.


More Telugu News