ఉదయం పూట తినకూడని ఆహారపదార్థాలు!

  • ఉదయం అల్పాహారంలో మైదా పిండి మంచిది కాదు
  • పాలిష్డ్ ధాన్యాలు, ప్రాసెస్డ్ ధాన్యాలు మంచివి కావు
  • ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ లో అధిక శాతం చక్కెరలు
ఉదయం తినే అల్పాహారానికి (బ్రేక్ ఫాస్ట్) ఎంతో ప్రాధాన్యం ఉంది. మన శరీర జీవక్రియలపై మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ప్రభావం చూపిస్తుంది. ఆ రోజు మన ఆరోగ్యం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేది ఇదే. ఉదయం అల్పాహారం తీసుకునే అలవాటు ఉన్నవారు తమకు అన్ని రకాల పోషకాలు అందుతున్నాయా? అన్నది ఓ సారి పరిశీలించుకోవాలి. చాలా మంది తమకు వీలున్న పదార్థాలనో, లేదంటే ఇష్టమైన వాటినో తింటుంటారు. ఇక్కడ అందుబాటు, రుచులకే ప్రాధాన్యం కానీ, పోషకాలకు ప్రాముఖ్యత ఇచ్చే వారు తక్కువ. ఉదయం అల్పాహారం తీసుకున్నా.. త్వరగా ఆకలి వేస్తుంటే, నీరసం వస్తుంటే, ఉత్సాహంగా లేకపోతే, శక్తి చాలదన్నట్టు అనిపిస్తుంటే తీసుకున్న ఆహారం సరైనది కాదని గుర్తించాలి. ముఖ్యంగా ఉదయం ఆహారంలో పోషకాలు, ఫైబర్ కు చోటు ఇవ్వాలి. అయితే, బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోకూడని పదార్థాల గురించి తెలుసుకుందాం.

ప్రాసెస్డ్ సిరియల్స్
ఇన్ స్టంట్ ఫుడ్స్, పాలిష్ పట్టించిన ధాన్యం, ప్రాసెస్డ్ ధాన్యాలు, వాటితో చేసిన ఏ ఆహారాలనూ ఉదయం తీసుకోవడం మంచి నిర్ణయం కాదు. ఇవి తృణ ధాన్యాలు కాదు. వీటిల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. వీటిని తీసుకోవడం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం దీర్ఘకాలంలో రావచ్చు.

యుగర్ట్
అల్పాహారంలో భాగంగా యుగర్ట్ తీసుకోకూడదు. ఫ్లావర్డ్ యుగర్ట్ లో చక్కెరలు, తీపి కారకాలను కలుపుతారు. వీటి మోతాదు అవసరానికంటే ఎక్కువే ఉండొచ్చు. అందుకే వీటిని ఉదయం తినొద్దని చెబుతారు.

వైట్ బ్రెడ్
మనలో చాలా మంది ఇష్టంగా తినే తెల్లటి బ్రెడ్ లో పీచు ఏమీ ఉండదు. మైదాతో చేసే దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇందులో పెద్దగా పోషకాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు ఎక్కువ. పైగా చాలా మంది బ్రెడ్ కు జామ్, తేనె రాసుకుని తినేస్తుంటారు. ఇదంతా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. బ్రెడ్ మాత్రమే తినాలనుకునేవారు హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవడం కాస్త నయం. 

ప్యాన్ కేక్స్
వీటిల్లో ప్రొటీన్ ఎక్కువే. కానీ వీటిల్లో ఉపయోగించేది మైదా పిండి. మైదాతో స్థూలకాయం సహా ఎన్నో దీర్ఘకాల వ్యాధులు వస్తాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఫ్రూట్ జ్యూస్
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లను కూడా ఉదయం తాగకూడదు. వీటిల్లోనూ చక్కెరలను దండిగా కలుపుతారు. నిజానికి వీటిల్లో అసలు ఫ్రూట్ కంటెంట్ 10 శాతం కూడా ఉండదు. మిగతాదంతా ఫ్లావర్లు, చక్కెరలు, నీరు. వీటిని తరచూ తీసుకుంటుంటే మధుమేహం, గుండె జబ్బులు, స్థూలకాయం ముప్పు ఉంటుంది.

కాఫీ
ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం కూడా మంచిది కాదని చెబుతారు. నిజానికి కాఫీ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే ఏదైనా తిన్న తర్వాతే కాఫీ తాగాలన్నది నిపుణుల సూచన. అలాగే, డోనట్స్, స్మూతీలు, స్వీట్లను కూడా ఉదయం పూట తీసుకోకూడదు.


More Telugu News