ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది: కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చడంలో ఆప్ విజయం సాధించిందన్న కేజ్రీవాల్
  • ఉచిత విద్యుత్‌, రేషన్‌, నిరుద్యోగ భృతి వంటి హామీలు తామిచ్చామని వెల్లడి
  • వీటినే కాంగ్రెస్ అనుసరించిందని వ్యాఖ్య
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్‌, ఉచిత రేషన్‌, నిరుద్యోగ భృతితో కూడిన ఆప్‌ మేనిఫెస్టోతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిందని చెప్పారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌ నాయకులను ఉద్దేశించి కేజ్రీవాల్‌ మాట్లాడారు.

దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చడంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించిందని కేజ్రీవాల్ అన్నారు. ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మేనిఫెస్టోని అనుసరించడంతోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ మా పార్టీ నుంచి ప్రేరణ పొందింది’’ అని చెప్పుకొచ్చారు.

‘‘మేము మా మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్‌, నిరుద్యోగ భృతి, ఉచిత రేషన్‌ వంటి హామీలు ఇచ్చాం. కాంగ్రెస్‌ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అవే వాగ్దానాలను చేసింది. ఇతర పార్టీలు కూడా విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించాయి’’ అని అన్నారు.

మే 4, 11 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో రెండు దశల్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వీటిలో మూడు నగర పాలికల చైర్‌పర్సన్‌ స్థానాలు, ఆరు నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ స్థానాలు, ఆరు నగర నిగమ్‌ కౌన్సిలర్‌ స్థానాలతోపాటు పలు వార్డులను ఆప్ గెలుచుకుంది. గెలుపొందిన ఆప్‌ నాయకులను కేజ్రీవాల్‌ అభినందించారు.


More Telugu News