సీబీఐకి మరో లేఖ రాసిన ఎంపీ అవినాశ్ రెడ్డి

  • ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి
  • సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు ఉందన్న ఎంపీ
  • తల్లి అనారోగ్యం అంశాన్ని ప్రస్తావించిన అవినాశ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం ఇవ్వాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోమారు సీబీఐకి లేఖ రాశారు. ఈ కేసులో ఎంపీని విచారించే అంశం క్షణానికో మలుపు తిరుగుతోంది. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ.. తన పిటిషన్ ను వెంటనే విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టు తన పిటిషన్ ను తిరస్కరించడంతో ఎంపీ అవినాశ్ రెడ్డి మరో మారు సీబీఐకి లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం రాసిన ఈ లేఖలో.. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. తనకు మరికొంత సమయం కావాలని, ఈ నెల 27 వరకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27 తర్వాత ఏ రోజు అయినా విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ మంగళవారం విచారణకు రానుందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!


More Telugu News