కర్ణాటక విధాన సౌధను గోమూత్రంతో శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. వీడియో ఇదిగో!

  • విధాన సౌధను గో మూత్రంతో శుభ్రపర్చే సమయం వచ్చిందని గతంలో చెప్పిన డీకే శివకుమార్
  • బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ అదే పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
  • పూజ కూడా నిర్వహణ.. వీడియో వైరల్ 
కర్ణాటకలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ కాంగ్రెస్ నాయకులు విధానసౌధను ‘శుద్ధి’ చేశారు. సోమవారం నాయకులు, కార్యకర్తలు విధాన సౌధ ఆవరణలో ఆవు మూత్రంతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా పూజ కూడా చేశారు. తాము విధాన సౌధను శుద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బీజేపీ తన అవినీతితో అసెంబ్లీని కలుషితం చేసిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. విధాన సౌధను గో మూత్రంతో శుభ్రపర్చే సమయం వచ్చిందని ఈ ఏడాది జనవరిలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. ‘‘మేం విధాన సౌధను శుభ్రం చేయడానికి కొంత డెటాల్‌తో వస్తాం. నా దగ్గర శుద్ధి చేయడానికి కొంత ఆవు మూత్రం కూడా ఉంది’’ అని నాడు చెప్పారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించారు. 

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో 135కి పైగా సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. వారం రోజుల సందిగ్ధత తర్వాత సోనియా గాంధీ జోక్యంతో.. 20వ తేదీన సీఎంగా సిద్ధూ, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు.


More Telugu News