వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం విషమం: హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కర్నూలు ఆసుపత్రి వైద్యులు

  • కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ తల్లి
  • అవినాశ్ కోసం కర్నూలుకు చేరుకున్న సీబీఐ అధికారులు
  • ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న కడప, పులివెందుల వైసీపీ శ్రేణులు
కర్నూలు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ కోసం సీబీఐ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు అవినాశ్ కోసం వచ్చినట్టు కర్నూలు జిల్లా ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. సీబీఐ అధికారులు వచ్చారన్న సమాచారంతో కడప, పులివెందుల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నాయి. ఆసుపత్రి గేటు వద్ద వీరు బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

అవినాశ్ తల్లి విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి అవినాశ్ నిన్న లేఖ రాశారు. వరుసగా మూడోసారి కూడా ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో... సీబీఐ అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. అవినాశ్ ను అరెస్ట్ చేస్తారేమోననే టెన్షన్ నెలకొంది. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు, అవినాశ్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని విశ్వభారతి వైద్యులు ప్రకటించారు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నారని చెప్పారు. వాంతులు అవుతున్నాయని తెలిపారు. లోబీపీ ఉందని వెల్లడించారు. ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇంకొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.


More Telugu News