కంపెనీ షేరు ధర పెరిగితేనే ఉద్యోగుల జీతాల్లో పెంపు..స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్

  • ఈ ఏడాది జీతాలు పెరగవని తెలిసి ఉద్యోగుల్లో అసంతృప్తి 
  • ఉద్యోగులకు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లేఖ
  • కంపెనీ షేరు ధరతో  జీతాలు పెంపు ముడిపడి ఉందని స్పష్టీకరణ
  • త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ పనీతీరుపై షేరు ధర ఆధారపడి ఉంటుందని వెల్లడి 
మైక్రోసాప్ట్ ఉద్యోగుల జీతాల పెంపు అంశం తమ కంపెనీ షేర్ల ధరతో ముడిపడి ఉందని సంస్థ యాజమాన్యం తాజాగా పేర్కొంది. ఈ ఏడాది జీతాలు పెరగవని తెలిసి అసంతృప్తితో ఉన్న ఉద్యోగులకు మైకోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కపోటెల్లా ఆ మేరకు స్పష్టం చేశారు. ‘‘జీతాల పెంపునకు కంపెనీ షేర్ ధర పెరగడమే కీలకం’’ అని ఆయన స్పష్టం చేశారు. సాధారణ ఉద్యోగులతో పాటూ సీనియర్ అధికారులకూ ఈ ఏడాది జీతాలు పెంచమని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌లో గంటల లెక్కన పారితోషికం తీసుకునే సిబ్బందికి మాత్రమే జీతాలు పెరుగుతాయని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల ఇటీవల తెలిపారు. 

ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఉద్యోగులకు క్రిస్ కపోటెల్లా తాజాగా ఓ సందేశాన్ని ఇచ్చారట. ‘‘కంపెనీ త్రైమాసిక ఫలితాలు బాగుంటే స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్ల ధరలు పెరుగుతాయి, ఫలితంగా ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ తన మానవవనురలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. డాటా సెంటర్ల సామర్థ్యం పెంపునకు ప్రయత్నిస్తోంది. ఏఐ రంగంలో మార్పులకు అనుగుణంగా అగ్రస్థానంలో నిలవాలని ప్రయత్నిస్తోంది’’ అని క్రిస్ పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నెల మొదట్లోనే క్రిస్ తన వద్ద ఉన్న 1.55 మిలియన్ డాలర్ల విలువైన మైక్రోసాఫ్ట్ షేర్లను అమ్మేశారు. ఈ వారం మొదట్లో మరో 2.85 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.


More Telugu News