ముస్లింతో కూతురి వివాహాన్ని రద్దు చేసుకున్న బీజేపీ నేత

  • ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసిన ఘటన
  • ముస్లిం యువకుడితో పౌరీ మున్సిపల్ చైర్మన్ కుమార్తె వివాహం నిశ్చయం
  • సోషల్ మీడియాలో పెళ్లి పత్రిక వైరల్, వెల్లువెత్తిన విమర్శలు
  • వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించిన మున్సిపల్ చైర్మన్
  • అప్పుడు కూతురి ఆనందం, ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకు వెనక్కు తగ్గానని వ్యాఖ్య
తన కుమార్తె వివాహం విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో ఓ బీజేపీ నేత ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ మున్సిపల్ చైర్మన్ యష్పాల్ బేనామ్ కుమార్తె వివాహం ఓ ముస్లిం యువకుడితో నిశ్చయమైంది. ఈ నెల 28న వారి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వివాహ పత్రిక ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన కూతురు ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లాడటంపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. బీజేపీ అనుకూల వ్యతిరేక వ్యక్తులూ విమర్శలకు దిగారు. సోషల్ మీడియాలో ఇంతటి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన వెనక్కు తగ్గారు. 28న జరగాల్సిన పెళ్లి రద్దయ్యిందని ప్రకటించారు. 

‘‘కూతురి ఆనందం కోసం ఈ పెళ్లి జరిపించాలనుకున్నా. ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది’’ అని మీడియాతో యష్పాల్ వ్యాఖ్యానించారు. శుక్రవారం కొందరు స్థానిక ఝండా చౌక వద్ద యష్పాల్ దిష్టి బొమ్మ తగలబెట్టి నిరసన తెలిపారు. ‘‘ఈ వివాహాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని వీహెచ్‌పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ గౌడ్ మీడియాతో పేర్కొన్నారు.


More Telugu News