70 ఏళ్ల వయసులో స్కైడైవింగ్.. చత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి సాహసం.. వీడియో ఇదిగో!

  • ఆస్ట్రేలియాలో స్కైడైవింగ్ చేసిన చత్తీస్‌గఢ్ మంత్రి టీఎస్ సింగ్ దియో
  • వీడియో చూసి ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి
  • అద్భుతం చేశారంటూ మంత్రికి సీఎం శుభాకాంక్షలు
ధైర్యవంతులు, ఉత్సాహవంతులకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపించారు చత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దియో. 70 ఏళ్ల వయసులో ఆయన తాజాగా స్కైడైవింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన మంత్రి వర్గ సహచరుడి సాహసక్రీడ చూసి ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బాఘేల్‌ కూడా ఆశ్చర్యపోయారు. 

ఇటీవల టీఎస్ సింగ్ దియో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అక్కడ మంత్రికి స్కైడైవింగ్ చేసే అవకాశం వచ్చింది. స్కైడైవింగ్ అంటే విమానంలోంచి పారాషూట్ సాయంతో కిందకు దూకడం. ఈ క్రమంలో మంత్రి ఉత్సాహంగా ఈ సాహస క్రీడలో పాల్గొన్నారు. తాను పారాషూట్ సాయంతో విమానంలోంచి దూకుతున్న వీడియోను నెట్టింట్లో కూడా పంచుకున్నారు. ‘‘ఆకాశానికి హద్దు లేదు. ఆస్ట్రేలియాలో ఈసారి నాకు స్కైడైవింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇదో అద్భుతమైన అనుభవం. ఆసాంతం ఆస్వాదించా’’ అని కామెంట్ చేశారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ భాఘేల్‌ను కూడా ఈ వీడియో ఆకర్షించింది. ‘‘భలే మహారాజ్ సాబ్! మీరు అద్భుతం చేశారుగా. శుభాకాంక్షలు! ఇలాగే మీరు ఉత్సాహంతో ముందుకు సాగిపోవాలి’’ అని ట్వీట్ చేశారు.

నిపుణుడైన స్కైడైవర్ సాయంతో టీఎస్ సింగ్ ఈ సాహస క్రీడకు పూనుకున్నారు. పారాషూట్ ధరించాక ఆయన విమానంలోంచి కిందకు దూకారు. ఆ తరువాత జాగ్రత్తగా తనకు నిర్దేశించిన స్థలంలో దిగారు.


More Telugu News