సరికొత్త వ్యాపారంలోకి జొమాటో!

  • గృహ సేవల విభాగంలోకి ప్రవేశించనున్న సంస్థ
  • అర్బన్ కంపెనీకి పోటీగా పొరుగు సేవలను అందించాలని నిర్ణయం
  • ఇప్పటికే సొంతంగా యూపీఐ సేవలను ఏర్పాటు చేసుకున్న జొమాటో
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో భారత్‌ లో తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో విస్తరిస్తోంది. ఇప్పటికే సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన జొమాటో ఇప్పుడు గృహ సేవల విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అర్బన్ కంపెనీ మాదిరిగా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మొదలైన పొరుగు సేవలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, అర్బన్ కంపెనీకి పోటీగా హైపర్‌లోకల్ సర్వీస్ ప్రొవైడర్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. 

ఇప్పటికే ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న అర్బన్ కంపెనీతో పోటీ అంటే బలమైన జట్టు, అత్యధిక నాణ్యతతో కూడిన వ్యాపారంలో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తాను అర్బన్ కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. జొమాటో ద్వారా గృహ సేవల రంగంలోకి వస్తున్నందున అందులో నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపారు.


More Telugu News