ధోనీ మరో ఐదేళ్లు ఆడొచ్చు.. ఎలా అంటే..!: యూసఫ్ పఠాన్
- ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సాయంగా ఆడొచ్చన్న యూసఫ్
- కాకపోతే కెప్టెన్ గా ధోనీ కొనసాగడానికి ఉండదన్న పఠాన్
- ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని ప్రకటన
భారత క్రికెట్ లో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, కొందరికి అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అలాంటి వారిలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందరికంటే ముందుంటాడు. 42 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న తీరును ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు అభినందిస్తూనే ఉంటారు. మహీ ఇంకా చాలా ఏళ్ల పాటు క్రికెట్ కోసం ఆడాలని, దీనివల్ల భారత క్రికెట్, ఐపీఎల్ కు ప్రయోజనం కలుగుతుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ప్రకటించడం గమనార్హం.
ఎక్కువ మంది ధోనీ మరికొంత కాలం పాటు ఆడాలని కోరుకుంటున్న క్రమంలో.. ధోనీ కావాలనుకుంటే మరికొన్నేళ్లపాటు ఆడడానికి అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. దీనిపైనే మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ధోనీ మరో ఐదేళ్ల పాటు ఆడొచ్చన్నాడు. ‘‘ధోనీ ఎందుకు వీడ్కోలు పలకాలి. అతడేమీ రిటైర్మెంట్ గురించి ప్రకటించలేదు. కేవలం ఇతరులే దీని గురించి మాట్లాడుతున్నారు. అతడిలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆధారంగా మరో ఐదేళ్లు ఆడొచ్చు. అయితే ధోనీ కెప్టెన్ గా కొనసాగకపోవచ్చు. అభిమానులు మాత్రం అతడ్ని బ్యాటర్ గా, సీఎస్కే మెంటార్ గా చూడాలని కోరుకుంటున్నారు’’ అని పఠాన్ పేర్కొన్నాడు.