ఐపీఎల్‌లో 15 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసిన యశస్వి జైస్వాల్

  • ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్ క్యాప్డ్  ఆటగాడిగా ఘనత
  • 2008లో షాన్ మార్ష్ నెలకొల్పిన రికార్డు బద్దలు
  • ఈ సీజన్‌లో ఇప్పటికే 625 పరుగులు చేసిన యశస్వి
ఈ ఐపీఎల్‌లో పలువురు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అందులో ముందువరుసలో ఉన్న యంగ్‌స్టర్, రాజస్థాన్ రాయల్స్  ఓపెనర్ యశస్వి జైస్వాల్. సీజన్ ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న అతను రాజస్థాన్ బ్యాటింగ్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో అతను పలు రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ అర్ధ శతకంతో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో అతను సీజన్ లో 600 పరుగుల మైలురాయి దాటాడు. ప్రస్తుతం అతను 625 పరుగులతో ఉన్నాడు. 

దాంతో, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా (జాతీయ జట్టుకు ఆడని) రికార్డు సృష్టించాడు. 2008లో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ పంజాబ్ తరఫున చేసిన 615 పరుగుల రికార్డు 15 ఏళ్ల వరకూ కొనసాగించింది. ఇప్పుడు ఆ రికార్డు జైస్వాల్ సొంతమైంది. అంతేకాదు ఓ సీజన్‌లో 600 పరుగులు చేసిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు.

తొలి స్థానంలో రిషబ్ పంత్ (20 ఏళ్ల 226 రోజులు) ఉన్నాడు. జైస్వాల్ 21 ఏళ్ల 142 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ (24 ఏళ్ల 193 రోజులు) ఉన్నాడు. జైస్వాల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లాడి 48 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ 702 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


More Telugu News