ప్రజల జీవితాలను జగన్ ఆర్పేస్తున్నారు.. చంద్రబాబు ఫైర్

  • ఉత్తరాంధ్రకు జగన్ శనిలా దాపురించాడన్న చంద్రబాబు
  • రూ. 2 వేల నోటును రద్దు చేయాలని కేంద్రానికి సూచించింది తానేనన్న టీడీపీ అధినేత
  • జగన్ అధికారంలోకి వచ్చాక 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారన్న చంద్రబాబు
  • అనకాపల్లిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల జీవితాలను ఆర్పేస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. అనకాపల్లిలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై దుమ్మెత్తి పోశారు. ఈ నాలుగేళ్లలో తమ కోసం ఏమీ చేయని జగన్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఖర్చులు పెరిగాయే కానీ, సామాన్యుల ఆదాయం మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. రూ. 2 వేల నోటును రద్దు చేయాలని గతంలో కేంద్రానికి తాను సూచించానని, ఇప్పుడు కేంద్రం వాటిని చెలామణి నుంచి ఉపసంహరించుకుంటోందని తెలిపారు. పెద్ద నోటు రద్దు శుభసూచకమని అన్నారు. 

జగన్ డబ్బు పిశాచి అని, ఆయనకు ఎంత వచ్చినా చాలడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని సంపదంతా ఆయనకే కావాలని, డబ్బుల కోసం ఎవరినైనా చంపేస్తాడని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది న్యాయమా? అని ప్రశ్నించారు. రోడ్ షోలను నిషేధించేందుకు ప్రయత్నించి జగన్ భంగపడ్డారని అన్నారు. తన రోడ్ షోలకు సహకరిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నీతి నిజాయతీకి మారుపేరైన ఉత్తరాంధ్ర జిల్లాలను వైసీపీ నాశనం చేస్తోందన్నారు. వైసీపీ గద్దలు విశాఖపై  వాలి దోచేస్తున్నాయని ఆరోపించారు. బాబాయ్ కిల్లర్ అవినాశ్ రెడ్డి డ్రామాలపై ఓ సినిమాను తీయొచ్చన్న చంద్రబాబు.. ఆయనను సీబీఐ కూడా పట్టుకోలేకపోతోందని చంద్రబాబు విమర్శించారు. 

చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
*  లులూ గ్రూప్ పెట్టుబడిదారులకు అనుమతించివుంటే రూ.2,200 కోట్లు పెట్టుబడి పెట్టివుండేవారు. 7 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి
* ఉత్తరాంధ్రకు జగన్ శనిలా దాపురించాడు
*  నేను అమరావతిని రాజధానిగా చేసి విశాఖను ఆర్థిక రాజధానిగా, టూరిజం హబ్‌గా చేద్దామనుకున్నాను
* జగన్ శనిలా వచ్చి మూడు ముక్కలాట ఆడుతున్నాడు
* ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అనే మాట తప్పకుండా నిరూపించుకుంటా
* రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో 14వ స్థానానికి వచ్చేసాం
* నేను ఉన్నప్పుడు మొదటి స్థానంలో ఉన్నాం


More Telugu News