చివరి నాలుగు మ్యాచ్ లపై ఉత్కంఠ.. ప్లే ఆఫ్ బెర్త్ లపై వీడని సస్పెన్స్

  • ఇప్పటికి కేవలం గుజరాత్ కే స్థానం ఖాయం
  • సీఎస్కే, లక్నో, బెంగళూరు, ముంబై వరుస స్థానాల్లో
  • శని, ఆదివారాల్లో తుది మ్యాచుల తర్వాతే స్పష్టత
ఐపీఎల్ 2023.. ప్లే ఆఫ్ కు వెళ్లే మిగిలిన మూడు జట్లు ఏవో తెలుసుకోవాలంటే చివరి రోజు వరకూ వేచి చూడక తప్పదు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ పై బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చక్కని విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ కు దూసుకుపోయింది. సీఎస్కే, లక్నో, ఆర్సీబీ, ముంబై జట్లు ఏడు విజయాలతో వరుసగా ఐదో స్థానం వరకు ఉన్నాయి. సీఎస్కే, లక్నో, ఆర్సీబీ, ముంబై, రాజస్థాన్, కేకేఆర్, పంజాబ్ జట్లకు అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అది ఎలా అన్నది చూద్దాం.

నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండూ 13 మ్యాచులు ఆడాయి. చెరో ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి గెలుస్తుంది. దాంతో ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఆర్సీబీ, ముంబై జట్లతో సమాన స్థాయికి చేరుతుంది. ఆర్సీబీ, ముంబై తమ తుది మ్యాచుల్లో ఓడిపోతే అప్పుడు అవకాశాలు కష్టమవుతాయి. ఎందుకంటే బోనస్ పాయింటు పుణ్యమా అని సీఎస్కే, లక్నో 15 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. శనివారం లక్నో జట్టు కేకేఆర్ తో, సీఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడనున్నాయి. వీటిల్లో లక్నో, సీఎస్కే గెలిస్తే 8 విజయాలు, ఒక బోనస్ పాయింట్ (గతంలో మ్యాచ్ రద్దు కావడం వల్ల వచ్చింది) తో ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటాయి. అప్పుడు మరో స్థానం కోసం పోటీ ఉంటుంది. 

ఆదివారం ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ తో, ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ తో తలపడతాయి. సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ ను ఢీకొట్టేంత బలంగా లేదు. కనుక ముంబై గెలిచే అవకాశాలే ఎక్కువ. ఆర్సీబీ కంటే గుజరాత్ జట్టు బలంగా ఉంది. బెంగళూరు, గుజరాత్ మధ్య ఈ సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. గుజరాత్ కే విజయావకాశాలు ఎక్కువ. గుజరాత్ గెలిస్తే, అటు ముంబై విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు వెళ్లే నాలుగో జట్టు ముంబై అవుతుంది. ఒకవేళ ముంబై ఓడి, ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీకి బెర్త్ ఖాయమవుతుంది. అలాకాకుండా ఒకవేళ ముంబై, ఆర్సీబీ రెండూ గెలిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ పరంగా వీటిల్లో ఒక దానికి చోటు లభిస్తుంది. ఒకవేళ శనివారం మ్యాచుల్లో సీఎస్కే, లక్నో జట్లు ఓటమి పాలైతే.. ఆదివారం ముంబై, ఆర్సీబీ విజయం సాధిస్తే అప్పుడు ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళతాయి. లక్నో, సీఎస్కే మధ్య నెట్ రన్ రేటు ప్రకారం ఒకరికి ప్లే ఆఫ్ అవకాశం దక్కుతుంది. కనుక ప్లే ఆఫ్ అవకాశాలపై స్పష్టత కోసం ఆదివారం వరకు వేచి చూడక తప్పేలా లేదు.


More Telugu News