సీఎంగా ప్రమాణం చేయాలంటూ సిద్ధరామయ్యకు కర్ణాటక గవర్నర్ ఆహ్వానం

  • రేపు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం
  • సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణం
  • సోనియా, రాహుల్, స్టాలిన్, నితీష్ కుమార్, మమతా బెనర్జీకి ఆహ్వానం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ ఆహ్వానించారు. ఈ మేరకు సిద్ధరామయ్యకు లేఖ రాశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని సిద్ధరామయ్యకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.

గురువారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సిద్ధరామయ్యను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడిగా ఎన్నుకోవాలని డీకే శివకుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీఎల్పీ సమావేశంలో సభ్యులందరూ దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు. 

ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదితరులు గవర్నర్ కు అందజేశారు. గవర్నర్ తిరిగి సిద్ధరామయ్యకు లేఖ పంపించారు. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరిని కూడా ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా ఉన్నారు.


More Telugu News