ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు

  • ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద భారీ ఎన్టీఆర్ విగ్రహం
  • శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు
  • తెలంగాణ హైకోర్టులో 14 రిట్ పిటిషన్ల దాఖలు
  • విగ్రహ ప్రతిష్టాపనపై స్టే ఇచ్చిన హైకోర్టు
  • హర్షం వ్యక్తం చేసిన కరాటే కల్యాణి
ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఈ విగ్రహావిష్కరణను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా చేయాలని కూడా నిర్ణయించారు. ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు. 

అయితే ఈ విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు శ్రీకృష్ణుడి రూపంలోని విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, హైకోర్టులో 14 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం విగ్రహ ప్రతిష్టాపనపై స్టే ఇచ్చింది. ఖమ్మంలో విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో శ్రీకృష్ణ జేఏసీ ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం తదితర సంస్థలు ఉన్నాయి. 

కాగా, హైకోర్టు తీర్పు అనంతరం సినీ నటి కరాటే కల్యాణి స్పందించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపనను వ్యతిరేకిస్తున్న ఆదిభట్ల కళాపఠానికి కరాటే కల్యాణి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 

కోర్టు తీర్పు తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఎన్టీఆర్ కూడా మానవమాత్రుడేనని, ఆయనను దేవుడి రూపంలో ప్రతిష్టాపన చేయడం సరికాదని భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమ న్యాయవాదికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కరాటే కల్యాణి వివరించారు.


More Telugu News