కేసీఆర్ ఆ మాట అనుంటే అందరూ ఆయనను అభినందించేవారు: రేవంత్ రెడ్డి

  • కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి
  • బద్ధ వ్యతిరేకులు కూడా కాంగ్రెస్ ను అభినందిస్తున్నారన్న రేవంత్
  • కేసీఆర్ మాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడంలేదని విమర్శలు
  • బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ సమర్థిస్తున్నారని వ్యాఖ్య  
  • తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం, తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందని తెలిపారు. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్ని నిలిచిన అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని కొనియాడారు. 

కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి వివరించారు. నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాల్సిన అవసరం ఉందని, అవసరమైన మేరకు కాంగ్రెస్ తో పనిచేస్తామని మమతా బెనర్జీ చెప్పారని వెల్లడించారు. 

కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తాము అలాంటి సానుకూల స్పందన ఆశించడంలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా తాము కోరుకోవడంలేదని తెలిపారు. కానీ, కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, ప్రజలు ప్రజస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారన్న మాటను కేసీఆర్ అనుంటే ఎవరైనా ఆయను అభినందించేవారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనను అభినందించకపోయినా కనీసం తిట్టుండే వాళ్లు కాదని తెలిపారు. 

"కర్ణాటకలో ఫలితాలు వచ్చిన మొదటి రోజే బండి సంజయ్ ఏం చెప్పాడో చూడండి... కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నాడు. కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపించవన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అన్నాడు. 

బండి సంజయ్ ఈ మాటలు చెప్పిన నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ కూడా ఇవే మాటలు చెప్పాడు. కర్ణాటక ఫలితాల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు. అక్కడ మోదీ ఓటమిని గుర్తించడానికి కూడా కేసీఆర్ కు మనసొప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే... బీజేపీ భాషను, బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ స్పష్టంగా సమర్థించాడు. ఇన్నాళ్లూ కేసీఆర్ ఏంచెప్పాడు... మోదీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు, మోదీపై కొట్లాడతాం అన్నాడు. 

మోదీకి ఎదురొడ్డి నిలుస్తాం అని చెప్పిన విధానానికి, నిన్న ఆయన మాట్లాడిన విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ మాటలను ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ సమాజం దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News