తనకు, ఆర్మీకి మధ్య ఘర్షణ తెచ్చేందుకు కుట్రలు: ఇమ్రాన్ ఖాన్

  • పాకిస్తాన్ విపత్తు దిశగా వెళ్తోందని, దేశం విచ్ఛిన్నం కావొచ్చునన్న ఇమ్రాన్ 
  • రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ కావాలని వ్యాఖ్య 
  • చివరి శ్వాస వరకు పాకిస్థాన్ లోనే ఉంటానని వెల్లడి 
పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందని, దేశం విచ్ఛిన్నం కావొచ్చునని పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఈ రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణే మార్గమని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు.

ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అన్నారు. దేశం విపత్తు దిశగా వెళ్తోందని, అందుకే ఎన్నికలు నిర్వహించి, దేశాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. 70 శాతం మంది ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైందన్నారు.


More Telugu News