రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కులు.. వాటిల్లో రూ.1,070 కోట్ల కరెన్సీ

  • చెన్నైలోని తాంబరం వద్ద చోటు చేసుకున్న ఘటన
  • రూ.535 కోట్లను తీసుకెళుతున్న ట్రక్కులో సమస్య
  • దాన్ని తిరిగి చెన్నైకి పంపించే ఏర్పాట్లు
తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వెళుతున్న కరెన్సీ ట్రక్కులు ఉన్నట్టుండి నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆర్ బీఐ చెన్నై శాఖ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లను విల్లుపురానికి పంపించింది. రెండు ట్రక్కులు ఈ కరెన్సీ కట్టలతో విల్లుపురానికి బయల్దేరాయి. అక్కడి నుంచి జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీ పంపిణీ జరగాల్సి ఉంది. 

ఓ ట్రక్కులో సాంకేతిక సమస్య ఏర్పడడంతో తాంబరం వద్ద రెండు ట్రక్కులు ఆగిపోయాయి. జాతీయ రహదారిపై వెళుతున్న వీటికి 17 మంది పోలీసులు కాపలాగా ఉన్నారు. రూ.535 కోట్ల కరెన్సీని తరలిస్తున్న ఓ ట్రక్ నిలిచిపోయినట్టు క్రోమ్ పేట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మరింత భద్రతను కల్పించారు. 

తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధ ప్రాంగణానికి ట్రక్కులను తరలించారు. తాంబరం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ శ్రీనివాసన్ అక్కడకు చేరుకుని భద్రతను పర్యవేక్షించారు. సమస్యలేని ట్రక్ ను భద్రత నడుమ అక్కడి నుంచి పంపించారు. ఓ ట్రక్ లో సమస్యను మెకానిక్ లు సరిచేయలేకపోవడంతో దాన్ని తిరిగి చెన్నైలోని ఆర్ బీఐ కి పంపించే ఏర్పాట్లు చేశారు.


More Telugu News