ఆ విషయంలో మేం ఐక్యంగా ఉన్నాం: డీకే శివకుమార్ ట్వీట్

  • కర్ణాటక భవిష్యత్తు, ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యతన్న డీకే
  • కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సిద్ధరామయ్యతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన కేపీసీసీ చీఫ్
  • ఈ రోజు రాత్రి 7 గంటలకు సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన
కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో కాంగ్రెస్ లో వారం రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. తనకు ఇష్టం లేకపోయినా.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం నిర్ణయానికి ఓకే చెప్పానని డీకే చెప్పారు. 

ఈ నేపథ్యంలో సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించిన తర్వాత డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ‘‘కర్ణాటక సురక్షిత భవిష్యత్తు, ప్రజల సంక్షేమానికే మా మొదటి ప్రాధాన్యత. ఆ హామీ ఇవ్వడంలో మేము ఐక్యంగా ఉన్నాము’’ అని ఆయన పేర్కొన్నారు. తనతోపాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు.

మరోవైపు సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు ఈ రోజు రాత్రి 7 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కేపీసీసీ చీఫ్ హోదాలో శివకుమార్ వెల్లడించారు. క్వీన్స్ రోడ్డులోని ఇందిరా గాంధీ భవన్ లో జరిగే భేటీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రావాలని సూచించారు. ఇక శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


More Telugu News