పక్కపక్కనే మనిషి, శునకం.. చిరుత ఎంపిక ఏది?

  • పూణె-నాసిక్ హైవే పక్కన నిద్రించిన ఒక వ్యక్తి, ఒక శునకం
  • శునకాన్ని నోట కరుచుకొని పోయిన చిరుత
  • కుక్కలంటే చిరుత పులులకు ఎంతో ఇష్టమన్న ఐఎఫ్ఎస్ అధికారి
వేటాడడంలో చిరుతపులి తర్వాతే. వేట లక్ష్యాన్ని ఎంపిక చేసుకుందంటే మధ్యలో వేరేవి వచ్చినా పట్టించుకోదు. చిరుత పులి వేటకు సంబంధించి ఎన్నో వీడియోలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు చూడబోయేది పూణె-నాసిక్ జాతీయ రహదారిపై ఓ చిరుతపులి వేటకు సంబంధించినది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ షేర్ చేశారు. 

రహదారి పక్క ఖాళీ స్థలంలో మంచం వేసుకుని ఓ వ్యక్తి పడుకుని ఉన్నాడు. అతడికి అతి సమీపంలో ఓ తెల్లటి శునకం కూడా పడుకుని ఉంది. వీరి వెనుక లారీలు వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. ఆ లారీల వెనుక నుంచి ఓ చిరుత వీరు పడుకున్న ప్రాంతానికి వచ్చింది. వస్తూనే శునకాన్ని చూసింది. నేరుగా దాని దగ్గరకు వెళ్లి నోటితో కరుచుకొని తీసుకుని పోయింది. కుక్క అరుపులకు మంచంపై పడుకున్న వ్యక్తి లేచి చూడగా, చిరుతపులి కుక్కతో పారిపోతోంది. అదృష్టం ఏమిటంటే ఆ వ్యక్తిని చిరుతపులి టార్గెట్ చేసుకోకపోవడం. 

చిరుత పులులు శునకాలను ఇష్టపడతాయని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘‘దొంగతనంగా అది రావడం, దాని చురుకుదనం చూడండి. చిరుతపులి వస్తున్నా కుక్కకు కనీసం తెలియలేదు’’ అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు పలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

‘‘కుక్క అప్రమత్తంగా లేకపోవడం ఏంటి? అవి చాలా తక్కువ శబ్దాలను కూడా వినగలవు కదా. వాసన పసిగట్టగలవు’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ‘‘ఇదంతా చూసిన ఆ వ్యక్తి ఇంకెప్పుడూ బయట పడుకోడు. అంతేకాదు కొన్ని రోజుల పాటు నిద్రలేని రాత్రులు తప్పవు’’ అంటూ మరో యూజర్ పేర్కొన్నాడు.


More Telugu News