ఏపీలోని మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ!

  • ఆవుల‌ప‌ల్లి, ముదివీడు, నేతిగుంట‌ప‌ల్లి రిజర్వాయర్ల నిర్మాణాల‌పై స్టే ఇచ్చిన ఎన్జీటీ
  • రూ.100 కోట్ల జరిమానా తమకు భారమన్న ఏపీ 
  • ప్రస్తుతానికి రూ.25 కోట్లు జ‌మ చేయాలన్న సుప్రీం  
ఆవుల‌ప‌ల్లి, ముదివీడు, నేతిగుంట‌ప‌ల్లి రిజర్వాయర్ల నిర్మాణాల‌ విషయంలో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వీటి నిర్మాణంపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విధించిన స్టేని ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాక‌రించింది. చిత్తూరు జిల్లాలోని ఆవుల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తిని ఎన్జీటీ కొట్టి వేసి రూ. 100 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఎన్జీటీ ఆదేశాల‌ను ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ సర్కారు పిటిషన్ పై జ‌స్జిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ సుంద‌రేశ్ల‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం త‌ర‌పున సీనియర్ న్యాయ‌వాది ముకుల్ రోహత్గీ వాద‌న‌లు వినిపించారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే, ఎన్జీటీ రూ.100 కోట్ల జ‌రిమానా విధించ‌వ‌చ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా స్టే విధించింది. ఎన్జీటీ రూ.100 కోట్లు జ‌రిమానా విధించ‌డం చ‌ట్టబ‌ద్ధం కాద‌ని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని అంత జ‌రిమానా భారం అవుతుందన్నారు. రూ.100 కోట్ల జ‌రిమానా నిలుపుద‌ల చేయాల‌ని కోర్టును కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జ‌మ చేయాలని సుప్రీం ధర్మాసనం ఏపీ సర్కారును ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్కు వాయిదా వేసింది.


More Telugu News