దేశంలో 40.87 లక్షల అనుమానాస్పద సిమ్‌కార్డులు.. అందులో 50 వేలకుగాపై ఏపీలోనే!

  • మొత్తం 87.15 కోట్ల సిమ్ కార్డులను విశ్లేషించిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ 
  • 36.61 లక్షల సిమ్‌కార్డుల డిస్‌కనెక్ట్
  • 12,59,432 అనుమానాస్పద కార్డులతో తొలి స్థానంలో పశ్చిమ బెంగాల్
  • హిమాచల్ ప్రదేశ్‌లో అత్యల్పంగా 3,964 కార్డులు
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అనుమానిత సిమ్‌కార్డులు ఉన్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ వెల్లడించింది. మొత్తం 87.15 కోట్ల సిమ్‌కార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించిన అనంతరం దేశవ్యాప్తంగా 40.87 లక్షల అనుమానిత సిమ్‌కార్డులు ఉన్నట్టు లెక్కతేల్చింది. వీటిలో 36.61 లక్షల సిమ్ కార్డులను డిస్‌కనెక్ట్ చేసింది. 

అనుమానిత సిమ్‌కార్డులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఏకంగా 12,59,432 కార్డులను గుర్తించి అందులో 12,34,11 సిమ్‌లను డీయాక్టివేట్ చేసింది. 10,915 పీఎస్‌వో (పాయింట్ ఆఫ్ సేల్)లను బ్లాక్‌లిస్టులో పెట్టింది. 

ఆ తర్వాతి స్థానంలో హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (తూర్పు), గుజరాత్, అస్సాం, కోల్‌కతా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 5.06 కోట్ల సిమ్‌కార్డులను విశ్లేషించిన కమ్యూనికేషన్ల శాఖ వాటిలో 50,825 సిమ్‌లను అనుమానాస్పదమైనవిగా గుర్తించింది. వీటిలో 47,938 సిమ్‌లను డీయాక్టివేట్ చేసింది. 72 పీఎస్‌వో కేంద్రాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అలాగే, అనుమానాస్పద సిమ్‌కార్డులు తక్కువ స్థాయిలో ఉన్న రాష్ట్రాల్లో జమ్మూకశ్మీర్ (15,194), కేరళ (9,802), హిమాచల్ ప్రదేశ్ (3,964) ఉన్నాయి.


More Telugu News