మొహిసిన్ ఖాన్ సూపర్ బౌలింగ్... లక్నో విక్టరీ

  • ముంబయి ఇండియన్స్ పై 5 పరుగులతో లక్నో విజయం
  • ముంబయి ఇండియన్స్ లక్ష్యం 178 రన్స్
  • ఆఖరి ఓవర్ అద్భుతంగా విసిరిన మొహిసిన్ ఖాన్
  • 11 పరుగులు కొడితే ముంబయి గెలుస్తుందనగా 5 పరుగులే ఇచ్చిన మొహిసిన్
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు అనూహ్య రీతిలో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్ లో 11 పరుగులు కొడితే ముంబయికి విజయం దక్కుతుందనగా, లక్నో బౌలర్ మొహిసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. కచ్చితమైన యార్కర్లతో ముంబయి బ్యాట్స్ మెన్ టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్ లను కట్టడి చేశాడు. ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయంటే మొహిసిన్ ఖాన్ బౌలింగ్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

178 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. టిమ్ డేవిడ్ 19 బంతుల్లో 32 పరుగులు, కామెరాన్ గ్రీన్ 6 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. మొహిసిన్ ఖాన్ యార్కర్లను భారీ షాట్లుగా మలచడంలో వీరిద్దరూ తడబడ్డారు. 

అంతకుముందు ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ 59, కెప్టెన్ రోహిత్ శర్మ 37 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 9.4 ఓవర్లలో 90 పరుగులు జోడించడంతో ముంబయి విజయం సునాయాసమేననిపించింది. అయితే, సూర్యకుమార్ యాదవ్ (7), నేహాల్ వధేరా (16), విష్ణు వినోద్ (2) విఫలం కావడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. 

చివర్లో టిమ్ డేవిడ్ కొన్ని సిక్సులు కొట్టడంతో ముంబయి ఇండియన్స్ లో ఆశలు రేకెత్తాయి. కానీ మొహిసిన్ ఖాన్ తిరుగులేని బౌలింగ్ తో ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. తద్వారా లక్నో సూపర్ జెయింట్స్ కు సొంతగడ్డపై విజయాన్ని అందించాడు. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్ 2, మొహిసిన్ ఖాన్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా, ముంబయి ఇండియన్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.


More Telugu News