కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్

  • అర్ధరాత్రి ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి 
  • హిందీలో హెచ్చరించి, ఫోన్ కట్ చేసిన నిందితుడు
  • స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న ఆయన అధికారిక నివాసానికి సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.

సోమవారం అర్ధరాత్రి కేంద్రమంత్రి అధికారిక నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని, మంత్రిగారితో మాట్లాడాలని, ఆయనను హెచ్చరించాలని హిందీలో చెబుతూ ఫోన్ కట్ చేసినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్ చేసిన వ్యక్తి తన వివరాలను వెల్లడించలేదు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపింది.

గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, ఇందుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, నిందితుడు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దర్యాఫ్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. అన్ని కాల్ రికార్డ్స్ వివరాలు విశ్లేషిస్తున్నామని, నిందితుడు ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేశాడు కాబట్టి నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.


More Telugu News