ఒక కుటుంబంలో నలుగురు చేపల వేటకు వెళితే, ఒకరికే మత్స్యకార భృతి ఇవ్వడం అన్యాయం: కొల్లు రవీంద్ర

  • మత్స్యకారులను సీఎం జగన్ రోడ్డున పడేశారన్న కొల్లు రవీంద్ర
  • మత్స్యకారులను ఆదుకుంది చంద్రబాబు ప్రభుత్వమేనని వెల్లడి
  • కొత్తగా జగన్ చేస్తున్నదేమీ లేదని వ్యాఖ్యలు
  • ఇతర పథకాలు తీసుకుంటే మత్స్యకార భృతి ఇవ్వడంలేదని ఆరోపణ
  • కడలి పుత్రుల కడుపు కొడుతున్నారని విమర్శలు
జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర ధ్వజమెత్తారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఉద్ఘాటించారు. రూ.4 వేలు ఇచ్చి మత్స్యకారుల్ని ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమేనని, జగన్ కొత్తగా వారికి చేస్తున్నది ఏమీ లేదని వెల్లడించారు. 

రాష్ట్రంలో 20 లక్షలకు పైగా మత్స్యకారులుంటే కేవలం లక్షమందికి అరకొర సాయంచేస్తూ జగన్ వారిని వంచిస్తున్నాడని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు.

“మత్స్యకారులకు ఇచ్చే అరకొర సాయానికి కూడా జగన్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అమ్మఒడి తీసుకుంటే మత్స్యకార భృతి ఇవ్వబోమని, ఇతర పథకాలు పొందితే అర్హులు కారని చెబుతూ, కడలి పుత్రుల కడుపు కొడుతోంది. ఒక కుటుంబంలో నలుగురు చేపలవేటకు వెళితే, వారిలో ఒకరికే మత్స్యకార భృతి ఇవ్వడం వారికి అన్యాయం చేయడం కాదా? మత్స్యకారుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకూడదా? కొడుకు ఫీజు రీయింబర్స్ మెంట్ పొందితే, తండ్రికి మత్స్యకార భృతి ఇవ్వరా? ఇలా మత్స్యకారుల్ని మోసగిస్తున్న జగన్, వారిని తానే ఆదుకుంటున్నట్టు నేడు బాపట్లలో పచ్చి అబద్ధాలు చెప్పాడు" అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

చంద్రబాబు మేలు చేస్తే జగన్ చేసిందేమిటి?

గతంలో చంద్రబాబుగారు వేలాదిమంది మత్స్యకారులకు 75-90 శాతం సబ్సిడీతో వలలు, పడవలు, చేపల నిల్వకు అవసరమైన ఐస్ బాక్సులు, ద్విచక్ర వాహనాలు అందించారు. వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేల ఆర్థికసాయం అందించారు. చంద్రబాబు హయాంలో లీటర్ డీజిల్ ధర రూ.70లు ఉంటే, దానిపై మత్స్యకారులకు రూ.6 సబ్సిడీ ఇచ్చాము. వైసీపీ ప్రభుత్వం వచ్చాక డీజిల్ ధర రూ.102 కు చేరింది. రూ.32 ధర పెంచి, సబ్సిడీని రూ.9కి పెంచితే మత్స్యకారులకు మేలు చేసినట్టా? 

రాష్ట్ర ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్ని రూ.30 వేల కోట్లనుంచి రూ.70 వేల కోట్లకు పెంచింది చంద్రబాబు. 4 ఏళ్ల నుంచి సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, సెస్ పేరుతో రొయ్యల రైతుల్ని దోచుకుంటున్నది జగన్.

జగన్ పేదవాడా?

తండ్రి అధికారంతో లక్ష కోట్లు కొట్టేసి, రూ.43 వేల కోట్లు జప్తు చేయించుకున్న జగన్ పేదవాడా? 4 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ప్రజల సొమ్ము లక్ష కోట్లు కొట్టేసిన వ్యక్తి పేదవాడా? రూ.500 కోట్ల మత్స్యకార భరోసా ఇచ్చానన్న జగన్ మాటలు పచ్చిఅబద్ధాలు.

బాపట్ల సభలో నేడు జగన్ మాటలు వింటే నవ్వొస్తోంది. తాను పేదవాడినని దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం కాదా? 4 ఏళ్లలో లక్షల కోట్లు కొట్టేసి హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి, బెంగుళూరులో భారీ ప్యాలెస్ లు కట్టు కున్న జగన్ పేదవాడా? 40 సంవత్సరాలుగా నీతి, నిజాయతీ, క్రమశిక్షణలతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు పేదవాడా?

రాజధాని ప్రాంతంలో ఉండటానికి చంద్రబాబు వేరే ఇంట్లో అద్దెకు ఉంటుంటే, దాన్ని ఆయనకు రాసిచ్చారని జగన్ నిందలు వేస్తున్నాడు. జగన్ అభాండాలు, కల్లబొల్లి మాటలు, కట్టుకథలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ మత్స్యకారులకు, మత్స్యకార భరోసా కింద రూ.500 కోట్లు ఇచ్చానని చెప్పడం నిజంగా పచ్చి అబద్ధమే. ఓ.ఎన్.జీ.సీ వారు తమ పరిధిలోని సముద్ర ప్రాంతంలో వేటను నిషేధించినందుకు, మత్స్యకారులకు ఇస్తున్న సాయాన్ని కూడా జగన్ తాను ఇస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటుకాదా?” అని రవీంద్ర నిప్పులు చెరిగారు.


More Telugu News