ఈ రోజు నేనెవరో తెలియని వారు లేరు.. 43 స్థానాల్లో మేం గట్టి ఫోర్స్: వైఎస్ షర్మిల

  • ఎవరితోను పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పిన షర్మిల
  • విలీనం చేయాలనుకుంటే పార్టీ పెట్టకపోయేదానినని వ్యాఖ్య
  • తనకు పొత్తులపై మిస్డ్ కాల్స్ వస్తున్నాయన్న షర్మిల
పొత్తులపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అంతేకాదు, తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగా వచ్చిన కథనాలను ఆమె కొట్టి పారేశారు. తమది పేదలు, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు. తాము ఎవరితోను పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదన్నారు. విలీనం గురించి మాట్లాడుతూ.... విలీనమే చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని, పార్టీ పెట్టి రెండేళ్లుగా ఎందుకు కష్టపడుతున్నానని, పాదయాత్ర ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించారు. తాను చేరుతానంటే వద్దనే పార్టీ ఉన్నదా.. అప్పుడే ఏ పార్టీలో చేరని తాను, ఇప్పుడు విలీనం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు.

తన తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి, నిజాయతీగా పాదయాత్ర చేశానని చెప్పారు. ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా లోకల్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడానని చెప్పారు. ఈ రోజు షర్మిల అంటే తెలియని వారు తెలంగాణలో లేరన్నారు.

ఢిల్లీ సంస్థ ఒకటి సర్వే చేస్తే 43 స్థానాల్లో తమ పార్టీ గట్టి ఫోర్స్ అని తేలిందని చెప్పారు. ఈ లెక్కలు తాను చెప్పడం లేదని, ఢిల్లీ సంస్థ చేసిన సర్వే అన్నారు. ఇలాంటి సమయంలో పదికో, ఇరవైకో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. అన్ని పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తాయన్నారు. పొత్తుల కోసం తనకు కూడా మిస్డ్ కాల్స్  వస్తున్నాయని చెప్పారు. అయితే తాము చార్జింగ్ మోడ్ లోనే ఉన్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీని ప్రజలు బొంద పెడతారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు అయినా వస్తాయా అని ఎద్దేవా చేశారు.


More Telugu News