బొగ్గు గని పంపకం విషయంలో రెండు గిరిజన తెగల మధ్య గొడవ.. 15 మంది మృతి

  • పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో ఘటన
  • సన్నీఖేల్-జార్ఘున్ ఖేల్ గిరిజన తెగల మధ్య ఘర్షణలు
  • రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదం
ఓ బొగ్గు గని పంపకం సందర్భంగా పాకిస్థాన్‌లోని రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య పాకిస్థాన్‌లో జరిగిందీ ఘటన. కొహట్ జిల్లాలోని పెషావర్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని దారా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్-జార్ఘున్ ఖేల్ గిరిజన తెగల మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పెషావర్ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. 

ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో కచ్చితంగా ఎంతమంది గాయపడ్డారన్న విషయంలో స్పష్టత లేదని పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య కాల్పులను నిరోధించారు. గిరిజనుల మధ్య బొగ్గు గని విభజనకు సంబంధించి రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. దీంతో వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలుమార్లు ‘జిర్గాస్’ను నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


More Telugu News