మహిళల పేరు ముందు కుమారి, శ్రీమతి వాడకుండా నిరోధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు మొట్టికాయలు

  • చూస్తుంటే ప్రచారం కోసమే పిటిషన్ వేసినట్టు ఉందన్న కోర్టు
  • కోర్టు నుంచి ఎలాంటి ఊరట కోరుకుంటున్నారని ప్రశ్న
  • పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం
మహిళల పేరు ముుందు కుమారి, శ్రీమతి వంటి పదాలను వాడకుండా నిరోధించాలన్న పిటిషనర్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ పదాలను వాడాలా? వద్దా? అనేది ఆ వ్యక్తిని బట్టి ఉంటుందని స్పష్టం చేసింది. తమ పేరు ముందు కుమారి, శ్రీమతి వంటి పదాలను తగిలించాలని ఏ మహిళనూ అడగకుండా ఆదేశాలివ్వాలన్న పిటిషన్‌ను నిన్న విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

చూస్తుంటే ఇది ప్రచారం కోసమే దాఖలు చేసినట్టు ఉందని అభిప్రాయపడింది. కోర్టు నుంచి ఎలాంటి ఊరట కోరుకుంటున్నారని ప్రశ్నించింది. కుమారి, శ్రీమతి వంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోవాలని మహిళను అడగకూడదని మీరు అంటున్నారని, కానీ ఎవరైనా వాటిని వాడుకుంటే వారినెలా నిరోధిస్తారని నిలదీసింది. ఈ పదాలను వాడుకునేందుకు సాధారణ పద్ధతి అంటూ ఏదీ లేదని స్పష్టం చేసిన కోర్టు.. పేరుకు ముందు వాటిని ఉపయోగించాలా? వద్దా? అనేది ఆ వ్యక్తి ఎంపికను బట్టి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.


More Telugu News