పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెట్టారు: మాజీ మంత్రి బాలినేని

  • ఒంగోలులో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలినేని
  • అనంతరం జరిగిన సభలో ప్రసంగం
  • నాయకులు తమను పట్టించుకోవట్లేదన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉందని వ్యాఖ్య
  • సీఎం జగన్ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని కామెంట్
పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నందుకు బాధపడ్డానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. ఆ తరువాత వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. సోమవారం ఆయన ఒంగోలులో నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. పార్టీ నాయకులు తమను పట్టించుకోవట్లేదన్న భావన కార్యకర్తల్లో కొంతమేరకు ఉందని బాలినేని అన్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పారు. 

తనకు రాజకీయంగా జీవితం ఇచ్చిన ఒంగోలు నుంచే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. తనకు అయినవాళ్లు, కాని వాళ్లంటూ ఎవరూ లేరని, కావాల్సిందల్లా కార్యకర్తల మేలేనని చెప్పారు. వారి కోసం తమ పార్టీ నాయకుడు జగన్ మినహా ఎవ్వరినీ లెక్క చేయనని స్పష్టం చేశారు. మార్కాపురం, గిద్దలూరు, దర్శి నుంచి తాను పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఇప్పటివరకూ తనను అయిదు సార్లు గెలిపించిన కార్యకర్తల రుణం తీర్చుకుంటానంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.


More Telugu News