రోహిత్ శర్మ సరసన చేరిన దినేశ్ కార్తీక్... అత్యంత చెత్త రికార్డ్ నమోదు

  • ఆడమ్ జంపా బౌలింగ్ లో రెండో బంతికే ఔటైన దినేశ్ కార్తీక్
  • 2023 ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ పేలవ ప్రదర్శన
  • ఓవరాల్ గా 16 సార్లు డకౌట్ అయిన బెంగళూరు వికెట్ కీపర్
రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఆడమ్ జంపా బౌలింగ్ లో రెండో బంతికే అవుటయ్యాడు. అంపైర్ తొలుత నాటౌట్ గా ప్రకటించినప్పటికీ, డీఆర్ఎస్ కు వెళ్లడంతో రాజస్థాన్ కు అనుకూలంగా ఫలితం వచ్చింది. దీంతో పరుగులేమీ చేయకుండానే కార్తీక్ పెవిలియన్ కు చేరాడు. తద్వారా రోహిత్ శర్మ పేరుతో నమోదైన చెత్త రికార్డును సమం చేశాడు. 

ఐపీఎల్ లో పదహారుసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ తన పేరిట వరస్ట్ రికార్డును ఇటీవలే నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును దినేశ్ కార్తీక్ సమం చేశాడు. రోహిత్ 239 మ్యాచ్ లు ఆడి 234 ఇన్నింగ్స్‌లలో 16 సార్లు డకౌట్ కాగా, దినేశ్ 241 మ్యాచ్ లలో 220 ఇన్నింగ్స్ ఆడి 16 డకౌట్లు అయ్యాడు. 

వీరిద్దరి తర్వాత సునీల్ నరైన్, మన్ దీప్ సింగ్ లు 15 డకౌట్లతో తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్ 2023లో దినేశ్ కార్తీక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 12 మ్యాచులు ఆడిన దినేశ్ 140 పరుగులు మాత్రమే చేశాడు. 12.72 సగటుతో, 135.92 స్ట్రయిక్ రేటుతో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2023లో అతని అత్యుత్తమ స్కోర్ కేవలం 30 మాత్రమే.


More Telugu News