భైంసాలో ‘కేరళ స్టోరీ’ ప్రదర్శనకు పోలీసుల బ్రేక్

  • సున్నిత ప్రాంతం కావడంతో ప్రదర్శనకు అనుమతించలేమని కామెంట్
  • పోలీసుల తీరుపై హిందూ సంఘాల ఆగ్రహం
  • స్థానికంగా ఉద్రిక్తత.. పోలీసులతో హిందూ వాహినీ నేతల వాగ్వాదం
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శన తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తతకు దారితీసింది. సినిమా ప్రదర్శనను పోలీసులు చివరి నిమిషంలో అడ్డుకోవడంపై థియేటర్ యాజమాన్యంతో పాటు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సినిమా చూసేందుకు వచ్చిన వారు కూడా పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మతపరంగా సున్నితమైన ప్రాంతం కావడం వల్లే సినిమా ప్రదర్శనకు అనుమతివ్వలేదని పోలీసులు చెబుతున్నారు.

భైంసా పట్టణంలోని కమల థియేటర్ లో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శించాల్సి ఉంది. అయితే.. ఉదయం ఆట ఆరంభమయ్యే సమయంలో సినిమా ప్రదర్శన నిలిపి వేయాలంటూ పోలీసులు థియేటర్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో.. థియేటర్‌ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపి వేసింది. ఈ క్రమంలో థియేటర్‌ యాజమాన్యానికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సినిమా ప్రదర్శన ఆపేశారని తెలిసి బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీ శ్రేణులతో కలిసి థియేటర్‌ ముందు ధర్నా చేపట్టారు. హిందూవాహిని మహిళా విభాగం శ్రేణులు సైతం ఆందోళన చేశారు.

ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో హిందూ వాహిని నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు.. థియేటర్‌ సమీపంలోని వ్యాపార సంస్థలన్నింటినీ మూసి వేయించారు. మరోవైపు, సినిమా ప్రదర్శనను ఎలా అడ్డుకుంటారంటూ భైంసాలోని వ్యాపార వర్గాలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రదర్శన నిలిపి వేస్తే ఆందోళనకు సిద్ధమని హిందూ వాహిని తేల్చి చెప్పింది. మరోవైపు, సినిమాకు సెన్సార్ బోర్డ్ పర్మిషన్ ఉండగా ప్రదర్శన కోసం ప్రత్యేకంగా పర్మిషన్ ఎందుకని థియేటర్ యాజమాన్యం పోలీసులను ప్రశ్నించింది.


More Telugu News