45 ఏళ్లు దాటిన సగం మంది మహిళల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు!

  • ఎక్కువ మందిలో థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు
  • అధిక బరువు, మోకాళ్ల నొప్పులు
  • తగినంత విశ్రాంతి, సరైన ఆహారం లేకపోవడమే కారణాలు
మహిళలు 45 సంవత్సరాలకు సమీపిస్తుంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఎందుకంటే 45 దాటిన మహిళల్లో సగం మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడమేనని అంటున్నారు. మోకాళ్ల నొప్పులు, కడుపులో మంట, అలసట, హార్మోన్లలో అసమతుల్యత వల్ల థైరాయిడ్ తదితర సమస్యలు వెలుగు చూస్తున్నాయి. మహిళలు తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం టిఫిన్ చేస్తుంటారు. కానీ, ఎక్కువ సందర్భాల్లో వారు తినడం మానేస్తుంటారు. అంతేకాదు, ఉద్యోగాలు చేసే మహిళలు అటు కార్యాలయంలో పని, ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి బాధ్యతలతో విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తోంది. ఈ ఒత్తిడి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.

థైరాయిడ్, స్థూలకాయం, మానసిక దిగులుతో సైకియాట్రిస్టుల వద్దకు వచ్చే మహిళా రోగుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఏళ్ల పాటు తగినంత నిద్ర లేకపోవడం, పనిలో ఒత్తిడి, కుటుంబం, పిల్లల బాధ్యతలు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పనిపైనే ధ్యాస, పనికే సమయం కేటాయించడంతో విశ్రాంతి కరవవుతోంది. సరైన ఆహారం తీసుకోవడం లేదు. దీంతో కాల్షియం, విటమిన్ డీ లోపాలు వేధిస్తున్నాయి. దీనివల్ల వారు ఆస్థియో ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా నేడు మహిళల్లో థైరాయిడ్ సమస్య పెరుగుతోంది. సమతులాహారం తీసుకోవాలని, రోజూ 30 నిమిషాల పాటు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. సంతోషంగా ఉండాలని, దీనివల్ల ఒత్తిడిని జయించొచ్చని పేర్కొంటున్నారు. పనిచేసే మహిళలు అయితే ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలన్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు.


More Telugu News