ఎవరీ ప్రవీణ్ సూద్.. సీబీఐ కొత్త డైరెక్టర్‌‌తో డీకే శివకుమార్‌‌కు సమస్యేంటి?

  • సీబీఐ నూతన సారథిగా ఎంపికైన కర్ణాటక డీజీపీ
  • మూడేళ్ల పాటు కర్ణాటక డీజీపీగా పని చేసిన సూద్
  • అధికారంలోకి రాగానే ఆయనపై చర్యలుంటాయన్న డీకే
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ప్రధానమంత్రి మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి తో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నియామకాన్ని ఖరారు చేసింది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుంది. ఆ తర్వాత ప్రవీణ్‌ ఈ పదవిలోకి రానున్నారు. అయితే, ప్రవీణ్‌ నియామకంపై అధిర్‌ రంజన్‌ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ప్రవీణ్ సూద్ ఎవరు?
ప్రస్తుతం కర్ణాటక పోలీస్ డీజీపీగా పనిచేస్తున్న 59 ఏళ్ల ప్రవీణ్ సూద్ స్వరాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. ఢిల్లీ ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఐఐఎం బెంగళూరు, న్యూయార్క్‌లోని సైరక్యూస్‌ యూనివర్సిటీలో చదివారు. 1986లో ఐపీఎస్ లో చేరారు. కర్ణాటక కేడర్ లో 1989లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా మైసూర్‌లో కెరీర్ ప్రారంభించారు. తర్వాత బెంగళూరులో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా నియమించబడటానికి ముందు బళ్లారి, రాయచూర్ ఎస్పీగా పని చేశారు. 2004 నుంచి 2007 వరకు మైసూర్ నగరానికి పోలీసు కమిషనర్‌గా కూడా ఉన్నారు. 

తన సర్వీసులో పాకిస్థాన్ మూలాలు ఉన్నవారితో సహా తీవ్రవాద నెట్‌వర్క్‌పై విస్తృతంగా పనిచేశారు. 2011 వరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగంలో అదనపు పోలీసు కమిషనర్‌గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2020 జనవరిలో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లకు పైగా పని చేశారు. ప్రవీణ్ సూద్‌కు 1996లో ముఖ్యమంత్రి బంగారు పతకం, 2002లో మెరిటోరియస్ సర్వీస్‌కి పోలీసు పతకం, 2011లో విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించాయి.

డీకే శివకుమార్‌తో సమస్య!
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ మార్చిలో డీజీపీ ప్రవీణ్ సూద్‌ను ‘నాలయక్’ (విలువలు లేని వ్యక్తి) అని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామంటూ వాగ్దానం చేశారు. ప్రవీణ్.. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన డీజీపీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలపై దాదాపు 25 కేసులు నమోదయ్యాయని, బీజేపీ నేతలపై ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. డీకే ఇప్పుడు సీఎం రేసులో ఉన్నారు. డీజీపీని తప్పించడం ఖాయం అన్న ప్రచారం జరుగుతుండగా.. ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే ఆయనను కేంద్రం సీబీఐ సారథిగా నియమించింది.


More Telugu News