సెంచరీకొట్టిన లోకేశ్ యువగళం!

  • జనగళమే యువగళమై 100వ రోజుకు చేరిక
  • ప్రజాచైతన్యంలో విజయవంతమైన తొలి మజిలీ
  • ప్రజల కష్టంలో మమేకమవుతూ ముందుకు సాగిన యువనేత
  • 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1269 కి.మీ. సాగిన యువగళం
రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా యువనేత నారా లోకేశ్ మొదలుపెట్టిన యువగళం యాత్ర 100వ రోజుకు చేరుకుంది. పలు ఆటంకాలను దాటుకుంటూ యాత్ర సాగుతోంది. 400 రోజుల్లో 4,000 వేల కిలోమీటర్లకు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. ప్రజల కష్టాల్లో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. క్షేత్ర స్థాయిలో జగన్ పాలనను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం తొలిమజిలీ చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన యువగళం యాత్ర ఇప్పటి వరకు 34 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,269 కిలోమీటర్లు సాగింది.

ఇందులో 32 బహిరంగ సభలు, 87 ముఖాముఖి కార్యక్రమాలు, హలో లోకేశ్ పేరుతో 4 ప్రత్యేక కార్యక్రమాల్లో లోకేశ్ ప్రసంగించారు. యువగళం యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23 రోజులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 32 రోజులు పాదయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో ఇప్పటి వరకు లోకేశ్ ప్రజల నుంచి 1900 వినతిపత్రాలు అందుకున్నారు.  

విరామం లేకుండా..
వంద రోజులకు చేరుకున్న పాదయాత్రలో లోకేశ్ కేవలం మూడుసార్లు అదీ అనివార్య పరిస్థితులలోనే బ్రేక్ తీసుకున్నారు. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది సందర్భంగా యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాళ్లకు బొబ్బలు వచ్చినా, హోరున వర్షం కురుస్తున్నా కష్టాల్లో ఉన్న ప్రజలను చేరుకోవాలనే ఆత్రుతతో లోకేశ్ నడక ఆపడంలేదు.

సెల్ఫీ ఛాలెంజ్..
పాదయాత్రలో భాగంగా టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విజయాలను, అధికారపార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నారా లోకేశ్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ ఆకట్టుకుంటోంది. కియా కంపెనీతో పాటు టీసీఎల్, జోహో, డిక్సన్ తదితర కంపెనీల వద్ద సెల్ఫీలు దిగి లోకేశ్ విసిరిన ఛాలెంజ్ లు యువతను ఆకట్టుకున్నాయి.

సెల్ఫీ విత్ లోకేశ్..
పాదయాత్రలో భాగంగా తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి యువనేత శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 1.40 లక్షల మంది అభిమానులతో లోకేశ్ ఫొటోలు దిగారు. తీవ్రమైన రెక్కనొప్పి వచ్చినా, వైద్యులు వారించినా లోకేశ్ వినలేదు. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఫొటోలను అప్ లోడ్ చేస్తూ, సెల్ఫీ దిగిన వారి ఫోన్లకు ఫొటోలు పంపే ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలో ఒకచోట నిర్వహిస్తున్న హలో లోకేశ్ కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

పాదయాత్రకు ఆటంకాలు..
పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. ఇందులో 3 కేసులు  లోకేశ్ పై నమోదయ్యాయి. పీలేరులో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో బాణసంచా కాల్చారని 3 కేసులు నమోదు చేశారు. ప్రచార రథంతో పాటు సౌండ్ సిస్టం, మైక్, స్టూల్.. ఇలా అన్నింటినీ సీజ్ చేశారు. పత్తికొండ, కర్నూలు వంటి ప్రాంతాల్లో నల్లజెండాలతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ వారికి లోకేశ్ దీటుగా సమాధానమిచ్చారు. 

పదునైన ప్రసంగాలతో..

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగ సభను నిర్వహిస్తూ లోకేశ్ తన  ప్రసంగాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతూ, ఆధారాలతో సహా బయటపెడుతుండడంతో అధికారపార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గానికి ఏంచేస్తామో చెబుతూ టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న లోకేశ్ తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. వివిధ వర్గాల ప్రజలతో కలిసి పాల్గొంటున్న ఆత్మీయ సమావేశాలలో.. ప్రజలు అడుగుతున్న అన్ని ప్రశ్నలకు సామాన్యునికి కూడా అర్ధమయ్యే విధంగా చాలా వివరంగా  సమాధానాలిస్తున్నారు.

ఇన్ స్టంట్ గా సాయం..
పాదయాత్రలో తనను కలిసి కష్టాలను చెప్పుకుంటున్న ప్రజలకు లోకేశ్ అక్కడికక్కడే సాయం చేస్తున్నారు. జీవితంలో దెబ్బతిన్న వారికి ఆర్థికసాయం చేసి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ ధైర్యం చెబుతున్నారు. ధర్మవరంలో రాములమ్మ అనే చేనేత మహిళకు, ఎమ్మిగనూరులో దళిత మహిళా రైతు రంగమ్మకు, శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ అనే రజక మహిళకు, నగరిలో ఆటో డ్రైవర్ హమీద్ బాషాలకు ఆర్థిక సాయం చేశారు.

వంద కిలోమీటర్లకు ఓ వరం
యువగళం యాత్రలో ప్రతీ వంద కిలోమీటర్లకు ఓ వరం పేరుతో లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇస్తున్నారు. చేపట్టకపోతే ఆయా ప్రాంతాల ప్రజలు తనను నిలదీయవచ్చని చెప్పడం యువనేత నిజాయతీకి అద్దం పడుతోందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 12 శిలాఫలకాలను లోకేశ్ ఆవిష్కరించారు. అవి..
1) బంగారుపాళ్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
2) జీడి నెల్లూరులో మహిళా డిగ్రీ కళాశాల
3) తొండమానుపురం వద్ద 13 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రక్షిత మంచినీటి పథకం
4) నరేంద్రకుంటలో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
5) మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు
6) చిన్నయ్యగారిపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్
7) గుట్టూరు వద్ద హంద్రీనీవా కాల్వ నుంచి ఎత్తిపోతల పథకం
8) మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
9) ప్యాపిలిలో తాగు, సాగు నీరు అందించేందుకు గుండాల ప్రాజెక్టు నిర్మాణం
10) సిరిగుప్ప క్రాస్ వద్ద ఆదోని టౌన్ వార్డ్ 21లో మౌలిక వసతుల కల్పన
11) ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు
12) అల్లూరులో హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకం

ఈ శిలాఫలకాలతో పాటు యువనేత లోకేశ్ వివిధ వర్గాలకు హామీలు ఇచ్చారు. రాయలసీమలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ప్రధాన సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపుతూ, హామీలు ఇచ్చిన యువనేత లోకేశ్.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అమలుచేస్తామని చెప్పారు.


More Telugu News