బంగ్లాదేశ్, మయన్మార్ భూభాగాలపై విరుచుకుపడిన భీకర తుపాను 'మోఖా'

  • బంగాళాఖాతంలో ఏర్పడిన మోఖా తుపాను
  • ఈ మధ్యాహ్నం మయన్మార్ నగరం సిట్వే వద్ద తీరం దాటిన వైనం
  • గంటకు 200 కిమీ పైగా వేగంతో ప్రచండ గాలులు
  • కుండపోత వర్షాలతో వరదలు
  • విలయం సృష్టించిన మోఖా
బంగాళాఖాతంలో మరింత బలపడిన అతి తీవ్ర తుపాను మోఖా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలపై విరుచుకుపడింది. మోఖా తుపాను ఈ మధ్యాహ్నం మయన్మార్ తీర ప్రాంతం సిట్వే వద్ద భూభాగంపైకి ప్రవేశించింది. 

అప్పటికే కేటగిరి-5 హరికేన్ స్థాయికి బలపడిన ఈ భీకర తుపాను దాటికి మయన్మార్ తీర ప్రాంతం వణికిపోయింది. ఇది తీరం చేరిన సమయంలో 209 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఇళ్లు, ఇతర భవనాలు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, సెల్ ఫోన్ టవర్లు, పడవలు ధ్వంసం అయ్యాయని మయన్మార్ సైన్యం వెల్లడించింది. 

కోకో దీవుల్లోని క్రీడా సముదాయం పైకప్పు ఎగిరిపోయింది. చాలా ప్రాంతాల్లో టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మోఖా తుపాను ప్రభావంతో ముగ్గురు మరణించారు. తుపాను నేపథ్యంలో, మయన్మార్ లోని రాఖీన్ రాష్ట్రంలో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, పునరావాస కేంద్రాల్లో తగినంత ఆహారం అందుబాటులో లేక ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 

అటు, బంగ్లాదేశ్ తీరంపైనా మోఖా పంజా విసిరింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక్కడి కాక్స్ బజార్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరం ప్రమాదం అంచున నిలిచింది. ఈ క్యాంపులో 10 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ క్యాంపులోని 500 షెల్టర్లు దెబ్బతిన్నాయి. 

భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండగా, వరదలు ముంచెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ తీర ప్రాంత గ్రామాల నుంచి సుమారు 5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వై-ఫై సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.


More Telugu News