మా మనోభావాలు దెబ్బతీయొద్దు ధోనీ: హర్బజన్ సింగ్

  • ఇప్పటికీ పాత ధోనీగానే కనిపిస్తున్నాడన్న హర్బజన్ సింగ్
  • అప్పటిలానే పెద్ద షాట్లు ఆడుతున్నాడని, సులభంగా సిక్సులు కొడుతున్నాడని వ్యాఖ్య
  • ధోనీ తన ఆటను కొనసాగించాలని విజ్ఞప్తి
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ మెంట్ గురించిన ఊహాగానాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ ఐపీఎల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతాడని చాలా మంది మాజీలు అంచనా వేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో రిటైర్ మెంట్ పై హింట్ ఇచ్చినట్లు ధోనీ మాట్లాడటం కూడా ఈ ప్రచారాన్ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఆటకు వీడ్కోలు పలకొద్దంటూ ధోనికి మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ విజ్ఞప్తి చేశాడు. ఇంకొన్ని రోజులు కొనసాగించాలని కోరాడు. 

స్టార్ స్పోర్ట్స్ తో హర్బజన్ మాట్లాడుతూ.. ‘‘సమయాన్ని ఎంఎస్ ధోనీ ఆపేశాడు. అతను ఇప్పటికీ పాత ధోనీగానే కనిపిస్తున్నాడు. అప్పటిలానే పెద్ద షాట్లు కొడుతున్నాడు.. సింగిల్స్ తీస్తున్నాడు. పూర్తి వేగంతో పరుగెత్తకపోయినా.. సిక్సర్లను సులభంగా కొడుతున్నాడు. బ్యాట్స్ మన్ గా ఇప్పటికీ అంతే ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మా మనోభావాలను దెబ్బతీయొద్దు ఎంఎస్ డీ. నువ్వు ఆటను కొనసాగించాలి’’ అని కోరాడు. 

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ధోనీపై ప్రశంసలు కురిపించారు. ‘‘ఒక ప్లేయర్ తన కెరీర్‌ చివరి దశకు చేరుకున్నప్పుడు.. చాలా మంది విమర్శిస్తూ మాట్లాడతారు. కానీ ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో వాళ్ల నోళ్లను మూయించాడు.’’ అని అన్నారు. 

‘‘ఈ సీజన్ లో ధోనీ తన జట్టును నెమ్మదిగా లక్ష్యం వైపు నడిపించాడు. తొలి రెండు స్థానాల్లో సీఎస్ కేను నిలపడంలో సాయపడాడు. కేవలం కెప్టెన్సీ ద్వారానే కాదు.. అతడి ఆన్ ఫీల్డ్ వ్యూహాలు కూడా సీఎస్ కే బాగా ఆడటానికి సాయపడ్డాయి. మంచి కెప్టెన్‌ నీడలో ఒక ఆటగాడు ఎలా పుంజుకుంటాడు అనేదానికి రహానే సరైన ఉదాహరణ’’ అని మిథాలీ వివరించారు.


More Telugu News