హిందూ జనాభా అధికంగా ఉన్న చోట ముస్లిం స్వతంత్ర అభ్యర్థి గెలుపు

  • అయోధ్య మేయర్ ఎన్నికల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
  • హిందూ జనాభా అధికంగా ఉన్న వార్డులో ముస్లిం యువకుడి పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచిన వైనం
  • హిందూ-ముస్లిం సౌభ్రాతృత్వానికి తన విజయం ప్రతీక అని యువకుడి హర్షం
అది రామజన్మభూమి ఉద్యమానికి పుట్టినిల్లయిన అయోధ్య. అక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే. ఇటీవల అక్కడ జరిగిన పురపాలక ఎన్నికల్లో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. హిందువులు మెజారిటీగా గల వార్డ్‌లో ఓ ముస్లిం యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటమే కాకుండా విజయం కూడా అందుకున్నాడు. 

ఇటీవల జరిగిన అయోధ్య మేయర్ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 60 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 27 బీజేపీ గెలుచుకోగా ఎస్పీ 17 వార్డులు, స్వతంత్ర అభ్యర్థులు మరో 10 స్థానాల్లో గెలుపొందారు. ఇక, సుల్తాన్ అన్సారీ అనే యువకుడు అభిరామ్ దాస్ వార్డ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. 

రామ మందిరం ఉద్యమంలో కీలక నేతగా వ్యవహరించిన అభిరాం దాస్ పేరిట ఈ వార్డును ఏర్పాటు చేశారు. అక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే. ఇక్కడ హిందువుల ఓట్లు 3,844 కాగా ముస్లింల ఓట్లు కేవలం 440. కానీ, ఎన్నికల్లో సుల్తాన్ అన్సారీ ఘన విజయం సాధించారు. ఇది హిందూ-ముస్లిం సౌభ్రాతృత్వానికి ప్రతీక అని అతడు ఫలితాల అనంతరం హర్షం వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో నిలబడ్డ తొలిసారి అన్సారీ విజయం సాధించడం మరో విశేషం. ‘‘అయోధ్యలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తున్నాయని చెప్పేందుకు నా గెలుపు ఓ గొప్ప ఉదాహరణ. ఎన్నికల సందర్భంగా నేను ఎటువంటి వివక్ష ఎదుర్కోలేదు. ఓటర్లు అందరూ నన్ను వారిలో ఒకడిగానే భావించారు. నాకు మద్దతు ఇచ్చి గెలిపించారు’’ అని చెప్పాడు అన్సారీ.


More Telugu News