పార్టీ ఫిరాయించిన 8 మందికి కర్ణాటక ఓటర్ల షాక్!

  • గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ తరపున గెలిచి బీజేపీలోకి ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలు
  • తాజా ఎన్నికల్లో ఆరుగురికి మాత్రమే దక్కిన విజయం
  • ఆరోగ్యమంత్రి కె.సుధాకర్ సహా పలువురి ఓటమి
కర్ణాటక అసెంబ్లీకి జరిగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ తరపున విజయం సాధించి, ఆ తర్వాత బీజేపీ గూటికి చేరిన ఎమ్మెల్యేల్లో 8 మంది తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, జేడీఎస్ నుంచి ముగ్గురు బీజేపీలోకి ఫిరాయించి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఈ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప అందరూ పోటీ చేశారు. వీరిలో ఆరుగురు మాత్రమే గట్టెక్కగా, 8 మందికి ఓటర్లు కోలుకోలేని షాకిచ్చారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వారంతా విజయం సాధించారు. దీంతో కొందరికి మంత్రి పదవులు కూడా దక్కాయి. అయితే, ఈసారి మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో సగం మంది ఓటమి పాలయ్యారు.

అప్పట్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఫిరాయించిన వారిలో ప్రతాపగౌడ పాటిల్, బీసీ పాటిల్, ఆరోగ్యమంత్రి కె.సుధాకర్, ఎంటీబీ నాగరాజ్, శ్రీమంత్ పాటిల్, మహేశ్ కుమతల్లి, కేసీ నారాయణ గౌడ, ఆర్.శంకర్ ఓటమి పాలయ్యారు. రోషన్ బేగ్, విశ్వనాథ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనంద్ స్థానంలో బరిలోకి దిగిన కుమారుడు సిద్ధార్థ్ సింగ్ ఠాకూర్‌ను కూడా ప్రజలు ఓడించారు.


More Telugu News