గెలుపంటే ఇదీ... పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

గెలుపంటే ఇదీ... పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు సజీవం
  • ఢిల్లీ క్యాపిటల్స్ పై అద్భుత విజయం సాధించిన పంజాబ్
  • 168 పరుగులు కొట్టలేక చతికిలబడిన ఢిల్లీ
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓటమిపాలైన వైనం
  • ఓ దశలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసిన ఢిల్లీ
  • చెలరేగిన పంజాబ్ బౌలర్లు
  • పేకమేడలా కూలిన ఢిల్లీ వికెట్లు
ఐపీఎల్ లో ప్రస్తుత ట్రెండ్ చూస్తే 168 పరుగుల టార్గెట్ ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓ దశలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసి గెలుపు దిశగా పయనిస్తున్నట్టు అనిపించింది. అప్పటికి 6.1 ఓవర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా కావల్సినన్ని ఓవర్లున్నాయి. 

కానీ, అక్కడ్నించి పంజాబ్ కింగ్స్ బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టారు. చివరికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 136 పరుగులు చేసి ఓటమిపాలైంది. 

ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పంజాబ్ అద్భుతంగా ఆడింది. సాధించింది ఓ మోస్తరు స్కోరే అయినా.... ఏమాత్రం ఆశలు కోల్పోకుండా ఢిల్లీ క్యాపిటల్స్ పనిబట్టింది. 31 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో తాను కూడా ఉన్నానని చాటింది. 

ఢిల్లీ ఇన్నింగ్స్ లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (54) అర్ధసెంచరీ సాధించగా, మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (21) ఫర్వాలేదనిపించాడు. వీళ్లిద్దరూ అవుటయ్యాక ఢిల్లీ లైనప్ పేకమేడను తలపించింది. పంజాబ్ స్పిన్నర్లు హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ సమయోచితంగా విజృంభించడంతో ఢిల్లీ బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. 

అమన్ ఖాన్ (16), ప్రవీణ్ దూబే (16), కుల్దీప్ యాదవ్ (10 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడడంతో ఢిల్లీకి ఆ మాత్రమైనా స్కోరు లభించింది. లేకపోతే 100 పరుగుల లోపు కుప్పకూలేది. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ ప్రీత్ బ్రార్ 4 వికెట్లు పడగొట్టగా, నాథన్ ఎల్లిస్ 2, రాహుల్ చహర్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.


More Telugu News