పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా పాకిస్థానీ తాలిబన్లు

  • ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కార్యకర్తలతో నిరసనల్లో పాల్గొనేందుకు తాలిబన్ల నిర్ణయం
  • పీటీఐకి అండగా నిలవాలంటూ తాలిబన్ కమాండర్ ఆదేశాలు
  • పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు సాధిస్తున్న విజయాలపై తాలిబన్ కమాండర్ హర్షం
పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చేపడుతున్న హింసాత్మక నిరసనలకు పాకిస్థానీ తాలిబన్లు మద్దతు పలికారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల, పీటీఐ పార్టీ కార్యకర్తల తరపున నిరసనల్లో పాల్గొనేందుకు కూడా నిర్ణయించారు. ఈ మేరకు తెహ్రీక్-ఏ-తాలిబన్ కమాండర్ సర్బకాఫ్ మహ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. పీటీఐ కార్యకర్తలతో పాటూ కలిసి నిరసనల్లో పాల్గొనాలని తాలిబన్లకు పిలుపునిచ్చాడు. గత రెండు రోజులుగా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు తమ లక్ష్యాలను చేరుకోవడంపై సర్బకాఫ్ మహ్మద్ హర్షం వ్యక్తం చేశాడు. 

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తరువాత పాకిస్థాన్ హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఆయన మద్దతుదారులు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఈ నిరసనల సెగ ఏకంగా కోర్ కమాండర్ అధికారిక నివాసాన్ని తాకింది. అంతేకాకుండా.. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ కార్యాలయాన్ని కూడా వారు కొంత సేపు అష్టదిగ్బంధనం చేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్‌ బెయిల్‌పై విడుదలయిన తరువాత పాకిస్థాన్‌లో హింసాత్మక నిరసలకు తెరపడింది. అన్ని కేసుల్లో  ఆయనకు కోర్టు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేసింది. మే 15 వరకూ ఎటువంటి అరెస్టులు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.


More Telugu News