కొంపముంచిన అభిషేక్ శర్మ ఓవర్... సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశల గల్లంతు

  • ఉప్పల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ పోరు
  • 7 వికెట్ల తేడాతో గెలిచిన లక్నో
  • 183 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో కొట్టేసిన లక్నో
  • ఒక ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్న అభిషేక్ శర్మ
  • చితకబాదిన నికోలాస్ పూరన్
ఈ టోర్నీలో పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలపై ఏవైనా ఆశలు మిగిలుంటే, అవి నేటితో ఆవిరయ్యాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో సొంతగడ్డపై నేడు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘోరంగా ఓడిపోయింది. 

182 పరుగుల స్కోరును కాపాడుకోలేక, చెత్త బౌలింగ్ చేసి తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. ఆఖర్లో వీరబాదుడు బాదిన లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను ఓడించింది. దీనికంతటికీ కారణం సన్ రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ!

ఓ దశలో లక్నో జట్టు 15 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగుల స్కోరుతో ఉంది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 30 బంతుల్లో 69 పరుగులు చేయాలి. అప్పటివరకు ఫర్వాలేదనిపించిన అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ 16వ ఓవర్ విసిరాడు. ఆ ఓవర్లో లక్నో బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. 

తొలుత స్టొయినిస్ రెండు సిక్సులు కొట్టి అవుట్ కాగా... ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ అదే ఓవర్లో మూడు సిక్సులు బాదాడు. మొత్తమ్మీద ఆ ఓవర్లో లక్నో జట్టుకు 31 పరుగులు లభించాయి. సగం పరుగులు ఆ ఓవర్లోనే రావడంతో లక్నో విజయం సునాయాసమైంది. 

లక్నో ఇన్నింగ్స్ లో ప్రేరక్ మన్కడ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పూరన్ గురించి. ఈ ఎడమచేతివాటం ఆటగాడు కేవలం 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 44 పరుగులు చేసి లక్నో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. స్టొయినిస్ కూడా ధాటిగా ఆడి 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 40 పరుగులు చేశాడు.

అంతకుముందు, క్వింటన్ డికాక్ 29 పరుగులు చేశాడు. లక్నో జట్టులో ఓపెనర్ కైల్ మేయర్స్ (2) ఒక్కడే విఫలమయ్యాడు. సన్ రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ 1, మయాంక్ మార్కండే 1, అభిషేక్ శర్మ 1 వికెట్ తీశారు. 

ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలకు తెరపడింది. ఇవాళ్టి మ్యాచ్ గెలిచుంటే ఆ జట్టు పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ, పసలేని బౌలింగ్ తో చేజేతులా మ్యాచ్ ను లక్నోకు అప్పగించారు. టోర్నీలో ఇప్పటిదాకా సన్ రైజర్స్ 11 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు, 7 ఓటములతో 9వ స్థానంలో నిలిచింది.


More Telugu News