కేసీఆర్ అండతో హైదరాబాద్‌లో కర్ణాటక క్యాంప్ రాజకీయాలు!: బండి సంజయ్

  • కర్ణాటకలో గెలవగానే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్న
  • కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదన్న సంజయ్
  • తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని వ్యాఖ్య
ఒక్క కర్ణాటక రాష్ట్రంలో గెలవగానే దేశమంతా గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తారా? అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులు ఉంటాయని, కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదనే విషయం గుర్తించాలని చెప్పారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి 36 శాతం ఓట్ షేర్ రాగా, ఈసారి కూడా అంతే వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే 38 శాతం నుండి 43 శాతానికి పెరిగిందని, జేడీఎస్ ఓటింగ్ 20 శాతం నుండి 13 శాతానికి తగ్గిందన్నారు. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంలో ఉండదన్నారు.

ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కొన్నాయని, కర్ణాటకలో మత రాజకీయాలు చేసిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ పరోక్ష మద్దతు పలికారన్నారు. ఎస్‌డీపీఐ, మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్ కు సపోర్ట్ చేశాయని, ఓ వర్గం ఓట్లతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. అక్కడి పరిస్థితులకు తెలంగాణ పరిస్థితులకు తేడా ఉందన్నారు. తెలంగాణలో ఐదు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ రెండింట విజయం సాధించిందని, మునుగోడు దాదాపు విజయం సాధించామని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు.

జీహెచ్ఎంసీలో తమ బలం నాలుగు సీట్ల నుండి 48 సీట్లకు పెరిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో తమ ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగిందని చెప్పారు. కర్ణాటక క్యాంపు రాజకీయాలు కేసీఆర్ అండతో హైదరాబాద్ లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని, బీఆర్ఎస్ కు దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్లుగా నాలుగు శాతం రిజర్వేషన్, బజరంగ్ దళ్ నిషేధం ప్రకటన చేయగలరా? అని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని జోస్యం చెప్పారు.


More Telugu News